స్టాక్ మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం.. మన ఐటీ స్టాక్స్ ఢమాల్!

స్టాక్ మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం.. మన ఐటీ స్టాక్స్ ఢమాల్!

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం బేర్స్ పంజాలు చిక్కుకుపోయాయి. ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రానున్న సమావేశంలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాలు అటు బులియన్ మార్కెట్లతో పాటు ఇటు స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేస్తున్నాయి. అమెరికా జాబ్ మార్కెట్ పుంజుకున్నప్పటికీ.. అధిక ద్రవ్యోల్బణ భయాలు మాత్రం సెంట్రల్ బ్యాంకర్లకు కంటి మీద కనుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ వద్దంటున్నప్పటికీ వడ్డీ రేట్లను పెంచేందుకే ఫెడ్ మెుగ్గుచూపుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలోని ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. 

అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు మరీ ముఖ్యంగా భారత ఐటీ కంపెనీల షేర్లను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ రాకతో ఏర్పడిన వాతావరణంలో ప్రాజెక్టుల కోసం తీవ్ర పోటీ పడుతున్న సాంప్రదాయ టెక్ కంపెనీల నెత్తిన వడ్డీ రేట్ల పిడుగు మరింత భారంగా మారుతుందని ఇన్వెస్టర్లు అంటున్నారు. ఈ క్రమంలో వారు అప్రమత్తం అయ్యి తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీకి చెందిన కంపెనీల షేర్లు ఈ రోజు ఇంట్రాడే మార్కెట్లలో భారీగా నష్టపోయాయి. 

సోమవారం ఉదయం 10.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 309 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 99 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 277 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 97 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లను నష్టాల్లో నడిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదే క్రమంలో ఇరాన్‌తో ఎలాంటి అణు ఒప్పందం లేదని ఆ దేశంపై తమ సైనిక చర్యలు కొనసాగుతాయని అమెరికా చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. దీంతో యుద్ధం వల్ల ఆర్థిక, వ్యాపార లావాదేవీలు నెమ్మదిస్తాయని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.3వేల 112 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం కూడా మన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.