జెన్‌జెడ్ స్టైలే వేరు.. అప్పులు చేసి సొంతిల్లు కొనుక్కోవటానికి 'NO' అంటున్నరు!

జెన్‌జెడ్ స్టైలే వేరు.. అప్పులు చేసి సొంతిల్లు కొనుక్కోవటానికి 'NO' అంటున్నరు!

25 ఏళ్లకు జాబ్ కొట్టాలె.. 30 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలె అన్నది మన తండ్రి, తాతల కాలం నాటి మాటలు. నేటి తరం జెన్ జెడ్ యువత ఈ రొటీన్ ప్లాన్ తమకు అస్సలు సెట్ కాదంటూ రూటు మార్చేస్తోంది. పాత స్క్రిప్ట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి.. ఆర్థిక స్వేచ్ఛ అంటే కేవలం భారీ జీతాలు అందుకోవడం మాత్రమే కాదు. ఉద్యోగాలు మార్చడం, నగరాలు మారడం, ప్రయాణాలు చేయడం, సొంతంగా వ్యాపారాలు లేదా సైడ్ హస్టిల్స్ ప్రారంభించడం అంటోంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఫైనాన్స్ క్రియేటర్లు, ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పుతున్నాయి. ఈ ఆర్థిక స్పృహ కారణంగా సొంతిల్లు కొనుగోలుపై వారి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. "నేను ఇల్లు కొనాలనుకుంటున్నానా?" అనే దానికంటే ఇప్పుడే ఇల్లు కొనాల్సిన అవసరం ఉందా? అని ఆలోచిస్తున్నారట. 

కలలు మారలేదు.. కానీ కాలం మారింది:
స్వాతంత్ర్యం, చురుకుదనాన్ని కోరుకునే ఈ తరానికి సొంత ఇల్లు అక్కర్లేదని కొందరు అనుకోవచ్చు. కానీ ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో సొంత ఇల్లు అనేది వ్యక్తిగత గోప్యత, భద్రత, మానసిక ప్రశాంతతను ఇస్తుందని జెన్-జీ బలంగా నమ్ముతోంది. సొంతిల్లు ఉండాలనే ఆశయం ఎక్కడికీ పోలేదు.. కానీ దానికి సంబంధించిన టైమ్‌లైన్ మాత్రం మారింది అంతే. సొసైటీ పెట్టే డెడ్ లైన్స్ ప్రకారం కాకుండా.. తమ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులు కుదిరినప్పుడే ఈ కీలక నిర్ణయం తీసుకోవాలని యువత భావిస్తోంది. 2026 జూన్ నాటి డెలాయిట్ సర్వే ప్రకారం.. 55 శాతం మంది జెన్-జెడ్ యువత తమ ఆర్థిక పరిస్థితుల కారణంగానే పెద్ద పెద్ద జీవిత నిర్ణయాలను వాయిదా వేసుకున్నట్లు తేలింది.

అనేక ఆదాయాలు.. స్థిరత్వం నిల్:
డిజిటల్ ఎకానమీ సంపాదన కోసం విభిన్న మార్గాలను తెరిచింది. భారతదేశంలో 75 శాతం మంది జెన్-జీ పారిశ్రామికవేత్తలు మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ కలిగి ఉన్నారని 2026 లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. ఫ్రీలాన్సింగ్, క్రియేటర్ ఎకానమీ, స్టార్టప్‌లు ఇలా అనేక రంగాల్లో నేటి యువత రాణిస్తున్నారు. అయితే సంపాదించడానికి బోలెడు దారులు ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒకేలాంటి స్థిరమైన నెలవారీ వేతనం ఉండకపోవచ్చు. క్రియేటర్ల సంపాదన బ్రాండ్ క్యాంపెయిన్‌లపై ఆధారపడి ఉంటుంది. ఫ్రీలాన్స్ వర్క్ మారుతూ ఉంటుంది. కెరీర్ మార్చుకోవడం లేదా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ హెచ్చుతగ్గులు సాధారణమే.

ఇప్పుడే కాకపోతే.. ఎప్పటికీ కాదన్నట్లు కాదు:
జెన్-జెడ్ యువతకు సొంతిల్లు కావాలని ఉండవచ్చు, కానీ దానికోసం హడావుడిగా ఇప్పుడే అప్పులపాలు కావాలని కోరుకోవడం లేదట. కెరీర్‌లో ఇంకా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రెంట్‌లో ఉండటం లేదంటే ఫ్యామిలీతో కలిసి ఉండటమే ఎక్కువ సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. 2026 తొలి త్రైమాసికంలో భారతదేశంలోని టాప్-7 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 7 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏకంగా 15 శాతం, బెంగళూరులో 8 శాతం వృద్ధి నమోదైంది. అందుకే వేచి చూడటం అనేది జెన్-జీ చేస్తున్న ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. పొదుపు పెంచుకుని, ఆర్థికంగా బలపడిన తర్వాతే లోన్ తీసుకోవాలని వారు భావిస్తున్నారు.

స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసే EMIల భయం:
సొంత ఇల్లు అనేది భద్రతను ఇస్తుంది. దానికోసం కట్టే పెద్ద EMI జీవితానికి కొన్ని కంచెలను వేస్తుంది. బెంగళూరు నుంచి ముంబైకి ఉద్యోగం కోసం మారాలన్నా.. కొద్ది రోజులు ప్రయాణాలు చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా భారీ లోన్ కాళ్లకూ బేడీలా మారుతుంది. ప్రాపర్టీ కొనేందుకు డబ్బులు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే కాదు.. ఆ ఆస్తి చుట్టూ ఉన్న జీవితం కూడా ఆర్థికంగా సాఫీగా సాగుతుందా అనే కోణంలో జెన్-జెడ్ ఆలోచిస్తోంది.

►ALSO READ | స్టాక్ మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం.. మన ఐటీ స్టాక్స్ ఢమాల్!

జెన్-జెడ్ భవిష్యత్తులో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆ మొదటి ఇల్లు అతి పెద్ద విలాసవంతమైన విల్లా అయి ఉండకపోవచ్చు. భారీగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకుని ఇబ్బందిపడే బదులు.. చిన్న అపార్ట్‌మెంట్ లేదా టైర్-2 నగరాల్లో ఇల్లు కొనడానికి వారు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే క్రిసిల్ నివేదిక ప్రకారం FY21, FY26 మధ్య టైర్-2 నగరాల్లో ఇళ్లకు డిమాండ్ 14 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కెరీర్ కోసం రెంటెడ్ హోమ్ బెస్ట్ అని భావించే వీరు.. కొనుగోలు చేసేటప్పుడు హోదా కంటే సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరానికి సొంతిల్లు అనేది ఒక లక్ష్యమే, కానీ అది వారి నేటి ఆర్థిక పరిస్థితికి, రేపటి జీవన శైలికి సరిగ్గా సరిపోవాలి. ఇల్లు కొన్నంత మాత్రాన జీవితంలోని మిగతా అవకాశాలు మూసుకుపోకూడదనేదే వారి ప్రధాన ఉద్దేశమట.