న్యూఢిల్లీ: ఇరాన్– అమెరికా యుద్ధం మళ్లీ తీవ్రమవ్వడంతో పాటు పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా ద్రవ్యోల్బణ డేటా ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. వీటితో పాటు ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కొనుగోళ్లు– అమ్మకాలు, రూపాయి కదలికలపై ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు. ఎఫ్‌ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.7,400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
కిందటి వారం బ్రెంట్ క్రూడ్ 8 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరుకుంది. ఆయిల్ ధరలు పెరిగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ మంచిది కాదు. మరోవైపు, అమెరికా జాబ్స్ డేటా బలంగా రావడంతో ఈ నెల 15–16 న జరిగే మీటింగ్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
అమెరికాలో వడ్డీ రేట్లు ప్రస్తుతం 3.50 శాతం నుంచి 3.75 శాతం మధ్య ఉన్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం గరిష్టాల్లో కొనసాగితే ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ నెల 11న అమెరికా ద్రవ్యోల్బణం డేటా వెలువడనుంది. దీనిని ట్రేడర్లు జాగ్రత్తగా గమనించనున్నారు.
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 749.08 పాయింట్లు (0.96శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 277.95 పాయింట్లు (1.14శాతం) క్షీణించాయి. దీంతో నిఫ్టీ వరుసగా నాలుగో వారంలోనూ నష్టాలను నమోదు చేసింది. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కూడా మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
