న్యూఢిల్లీ: రష్యా ఎగుమతులు భారీగా పడిపోవడం, అమెరికా సరఫరాలు నెమ్మదించడంతో యూరప్‌కు అవసరమైన డీజిల్ ఇంధనాన్ని అందించడంలో భారత్ అత్యంత కీలకంగా మారింది.
రీసెర్చ్ కంపెనీ వోర్టెక్సా రిపోర్ట్ ప్రకారం, ఆగస్టు నెలలో బాబ్- ఎల్ -మండేబ్ మార్గం గుండా రోజుకి 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ యూరప్‌కు చేరగా, ఇది ఈ యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకున్న మొత్తం డీజిల్‌లో సుమారు 60 శాతానికి సమానం.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా (వార్షిక సామర్థ్యం 25.81 కోట్ల టన్నులు) ఉన్న భారత్, తన దేశీయ అవసరాల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకంగా మారింది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యన్ రిఫైనరీలు దెబ్బతినడంతో డీజిల్ సరఫరా తగ్గింది. శీతాకాలంలో యూరప్‌లో డీజిల్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
