ఆజ్ సండే హై క్యా?.. శనివారం నాడే పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా: ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్!

ఆజ్ సండే హై క్యా?.. శనివారం నాడే పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా: ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్!

IND vs PAK: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఫేమస్ సండే ట్రోలింగ్‌ను సోషల్ మీడియా వేదికగా మళ్లీ రీస్టార్ట్ చేశాడు. నిన్నటి పోరులో పాక్ ఓడిపోగానే.. ఆజ్ సండే హై క్యా? (ఈ రోజు ఆదివారమా ఏంటి?) అని ఎక్స్ (ట్విట్టర్) లో పఠాన్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతంలో భారత్-పాక్ మ్యాచ్‌ల్లో సండే రోజున భారత్ గెలిచిన సందర్భాలను పురస్కరించుకుని పఠాన్ ఈ ఫన్నీ కామెంట్స్ తో ట్రోల్ చేసేవాడు. శనివారం మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు.

శ్రీ చరణి, ప్రేమా రావత్ విశ్వరూపం: 

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. భారత స్పిన్ ధాటికి తలవంచి పాక్ టీమ్ కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. ఇండియన్ బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్ అద్భుత ప్రదర్శన కనబరిచి చెరో 3 వికెట్లు పడగొట్టి పాక్ పతనంలో కీలక పాత్ర పోషించారు. కట్టుదిట్టమైన స్పిన్ బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా టీమిండియా కట్టిడేసింది.

గ్రూప్ స్టేజ్‌లో భారత్ రికార్డ్ అదుర్స్: 

56 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన కేవలం 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఖరారు చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 18 రన్స్, దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. ఈ ఘన విజయంతో భారత్ గ్రూప్ స్టేజ్‌ను అజేయంగా ముగించింది. థాయిలాండ్, హాంగ్‌కాంగ్, పాకిస్థాన్‌లపై వరుసగా విజయం సాధించి గ్రూప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నెగ్గి భారత్ పర్‌ఫెక్ట్ రికార్డును సొంతం చేసుకుంది.

పాకిస్థాన్‌కు ఇక చావో రేవో మ్యాచ్.. సెమీస్ చేరేనా?: 

ఈ ఘోర పరాజయంతో పాకిస్థాన్ సెమీఫైనల్ అర్హత అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌తో పాకిస్థాన్ పోటీ పడనుంది. సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే పాక్ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ, శనివారం జరిగిన ఈ ఏకపక్ష పోరులో భారత్ అద్భుత విజయంతో పాటు ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్ట్ భారత్-పాక్ క్రికెట్ శత్రుత్వంలో మరో రసవత్తర అధ్యాయాన్ని జోడించింది.