సిద్దిపేట టు హుస్నాబాద్.. మున్సిపల్ కమిషనర్ సైకిల్ సవారీ

సిద్దిపేట టు హుస్నాబాద్.. మున్సిపల్ కమిషనర్ సైకిల్ సవారీ
  • సుమారు 43 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చి పారిశుధ్య పనుల పరిశీలన

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సరికొత్త ప్రయత్నం చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్ సిద్దిపేటకు సైతం ఇన్ చార్జి కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేటలో సైకిల్ పై బయలుదేరిన ఆయన సుమారు 43 కిలోమీటర్లు తొక్కుకుంటూ హుస్నాబాద్ కు వచ్చారు. 

పట్టణంలో సైకిల్ పైనే తిరుగుతూ పారిశుధ్య సిబ్బంది పనితీరు, ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆఫీసర్లు ఆఫీసులకే పరిమితం కాకుండా ఫీల్డ్‌‌‌‌లో తిరిగినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం పట్టణంలో రెండో వార్డులో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సైకిల్ పై వచ్చిన కమిషనర్ ను మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు అభినందించారు. అనంతరం ఆయన తిరిగి సైకిల్ పైన్ సిద్దిపేట వెళ్లిపోయారు. మున్సిపల్ వైస్ చైర్‌‌‌‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, పూదరి వరప్రసాద్, కేశవేణి రమేశ్, బొల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వి.వెంకట రమణ, నాయకులు కిష్టస్వామి, రవీందర్, కొమురయ్య పాల్గొన్నారు.