చిట్యాల బోడు గుట్ట ‘చిన్న’బోయింది..! ఆంధ్రా రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తున్న మట్టి మాఫియా..

చిట్యాల బోడు గుట్ట ‘చిన్న’బోయింది..! ఆంధ్రా రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తున్న మట్టి మాఫియా..

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం రెవెన్యూ పరిధిలోని చిట్యాల బోడు గుట్ట అక్రమ మట్టి తవ్వకాలతో కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. సర్వే నంబర్లు 254, 302లో ఉన్న ఈ గుట్టను 15 రోజులుగా రాత్రివేళల్లో జేసీబీలు, టిప్పర్లతో తవ్వి, సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. 

తవ్వకాలతో గుట్ట సహజ స్వరూపం దెబ్బతింటుండగా, గుట్టను ఆనుకుని ఉన్న భూములను చదును చేసి కొందరు ఆక్రమించుకుంటూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగగూడెం రెవెన్యూ పరిధికి చెందిన ఓ వ్యక్తి మట్టి అనధికారికంగా ఒక్కో టిప్పర్‌‌‌‌కు రూ.500 వసూలు చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అలాగే లింగగూడెం, గౌరారం రెవెన్యూ పరిధిలో గిరిజనుల పేరుతో మైనింగ్ అనుమతులు తీసుకుని క్రషర్లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 

పేర్లు మావి.. పెత్తనం వాళ్లది..

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవనోపాధికి ఉన్న హక్కులను అడ్డుపెట్టుకుని కొందరు పెద్ద యంత్రాలతో గుట్టలను తవ్వి సహజ సంపదను తరలిస్తున్నారు. ఆఫీసర్లు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు, క్రషర్లను అడ్డుకుని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

- కాకా రుద్రజ రాణి, మాజీ సర్పంచ్, గౌరారం  

మైనింగ్ శాఖ పరిధిలోకి వస్తుంది..

లింగగూడెం, గౌరారం రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టల్లో తవ్వకాలు క్రషర్ల అనుమతులు మైనింగ్ శాఖ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఏదన్నా పనులు చేపట్టాలన్న మైనింగ్ శాఖ అనుమతులు తీసుకోవాలి. వారి అనుమతి పొందిన తర్వాత మాకు సమాచారం ఇస్తరు. చిట్యాల బోడు గుట్టలో తవ్వకాలు గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు.

- వీరభద్ర నాయక్, పెనుబల్లి తహసీల్దార్