- ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు.. త్వరగా చార్జ్‌షీట్ వేయాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు హత్యాచార ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలను విచారణలో తేల్చాలని సూచించారు.
మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా లేదా అన్న దానిపైనా విచారణ జరపాలని సీఎం స్పష్టం చేశారు. కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక ఆధారాల సేకరణను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ
బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం అందేలా కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించేందుకు అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన వ్యక్తికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దాలని ఆదేశించారు.
