కుత్బుల్లాపూర్, వెలుగు: ప్రజలను మోసం చేసి ఓ పాన్ బ్రోకర్ బంగారంతో పరారయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన మార్వాడీ రమేశ్ చంద్రగిరినగర్‌లో ‘శుభం పాన్ బ్రోకర్స్ అండ్ జ్యువెలర్స్’ పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని నగదు అప్పుగా ఇచ్చేవాడు. ఈ క్రమంలో 36 మంది వద్ద సుమారు 1.3 కిలోల బంగారం తాకట్టు పెట్టించుకుని, అందుకు రూ.23 లక్షలు అప్పుగా ఇచ్చాడు.
ఇందులో కొంతమంది తీసుకున్న అప్పును తిరిగి చెల్లించినప్పటికీ రమేశ్ వారి నగలను తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో రమేశ్ దుకాణానికి తాళం వేసి ఉండటంతో పాటు, అతడి ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
