ఇబ్రహీంపట్నం, వెలుగు: మన్నెగూడలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట, కోడిపందేల స్థావరంపై ఆదిభట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నేగూడలోని ఎన్‌ఎస్‌ఆర్ నగర్ కాలనీ సమీపంలోని రాజేశ్వర్‌రెడ్డి పౌల్ట్రీ ఫామ్‌లో కొందరు వ్యక్తులు కోడిపందేలతో పాటు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.
శనివారం రాత్రి పోలీసులు పౌల్ట్రీ ఫామ్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించి 22 మందిని పట్టుకున్నారు. మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారు. 31 పందెం కోళ్లు, రూ.3,60,510, 19 స్మార్ట్‌ఫోన్లు, పందేలకు వినియోగించే కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
