కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పనులు స్పీడప్.. రూ.8 వేల 888 కోట్లతో 15వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం

కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పనులు స్పీడప్.. రూ.8 వేల 888 కోట్లతో 15వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
  • ఇప్పటికే ప్రైమరీ డీపీఆర్ రెడీ బోర్​హోల్స్​ పర్మిషన్ కోసం పీసీసీఎఫ్ కు లెటర్
  • ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్​, వెలుగు : గ్రీన్​ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న కల్లూరు పంప్డ్​స్టోరేజీ ప్రాజెక్ట్​(పీఎస్​పీ)ను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఖమ్మం జిల్లాలో రూ.8,888 కోట్లతో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ​రెడీ చేసిన జెన్​కో డీపీఆర్​తయారీకి సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్​నిర్మాణ స్థలంలో 23 చోట్ల బోర్​హోల్స్ వేయడానికి ఫారెస్ట్​ డిపార్ట్ మెంట్​నుంచి పర్మిషన్ తీసుకునేందుకు పీసీసీఎఫ్​ఆఫీస్ కు లెటర్ రాశారు. ఆరు నెలల్లో ఎన్విరాన్​మెంటల్​క్లియరెన్స్​తీసుకొని టెండర్లు పిలవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.

తొలి పంప్డ్​ స్టోరేజ్​ఇదే..!

నెట్​జీరోలో భాగంగా రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో 4,750 మెగావాట్లు, 2035 నాటికి 7,500 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్​ఎనర్జీ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జెన్​కో 13 సైట్లను గుర్తించింది. మొత్తం 12,850 మెగావాట్ల పీఎస్​పీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.71,210 కోట్లు ఖర్చు కానున్నట్లుగా లెక్కలు తేల్చారు. అయితే నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న సర్కారు, ప్రయారిటీ ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యత లిస్ట్ లో ఉన్న ఖమ్మం జిల్లాలోని కల్లూరు ప్రాజెక్ట్​ను రాష్ట్ర ప్రభుత్వం టేకప్​చేసింది. 

ఇక్కడ 1,500 మెగావాట్స్​సామర్థ్యం గల పీఎస్​పీ ప్రాజెక్ట్​ను రూ.8,888 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్​కు అవసరమైన 0.40 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్​లెఫ్ట్​కెనాల్​నుంచి తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. డిటైల్డ్​ప్రాజెక్ట్​ రిపోర్ట్​తయారు చేసేందుకు హైదరాబాద్​లోని ఆర్ వీ ఇంజినీరింగ్​కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. డీపీఆర్​తో పాటు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, ఇతర అన్ని రకాల క్లియరెన్స్​లు తీసుకురావడానికి ఫీజు కింద రూ.7.75 కోట్లను చెల్లించి గతేడాది నవంబర్​4న అగ్రిమెంట్​చేసుకున్నారు. 

కేంద్రం నుంచి రూ.1,325 కోట్ల సబ్సిడీ 

కల్లూరు పంప్డ్​స్టోరేజ్​ప్లాంట్​నిర్మాణానికి కేంద్రం నుంచి సబ్సిడీ అందనుంది. పీఎస్​పీ ప్లాంట్​నిర్మాణంలో ఒక మెగావాట్​కు రూ.0.75 కోట్ల చొప్పున రూ.1,125 కోట్లు, ప్రైమరీ సబ్సిడీగా మరో రూ.200 కోట్లు అందించనున్నారు. ఈ నిధులతో ప్లాంట్​నుంచి గ్రిడ్​వరకు ట్రాన్స్​మిషన్​లైన్లు, రోడ్లు, డ్రైనేజీ, ఇతర అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 

పీసీసీఎఫ్​ఆఫీస్ కు లేఖ రాసిన జెన్​కో

ప్రాజెక్ట్ డిటెయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయడానికి మూడు ఇంచుల డయాతో 23 చోట్ల బోర్​హోల్స్​వేసి సాయిల్​రిపోర్ట్​ తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ల్యాండ్​లో కొంత భాగం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​పరిధిలో ఉండడంతో బోర్​హోల్స్​వేసేందుకు అనుమతి కోరుతూ జెన్​కో ఆఫీసర్లు ఆఫీస్ కు లెటర్ రాశారు. అనుమతులు రాగానే ఆరు నెలల్లో సాయిల్​ టెస్ట్​లు పూర్తి చేసి రిపోర్ట్​ఆధారంగా టెండర్లు పిలవనున్నారు.  

త్వరలోనే టెండర్లు పిలుస్తం 

కల్లూరు పీఎస్​పీ ప్లాంట్​ఏర్పాటు వర్క్​స్పీడ్ గా జరుగుతోంది. 1,500 మెగావాట్ల ప్లాంట్​ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. ప్రాజెక్ట్​ సైట్​లో సాయిల్​ టెస్ట్​లు పూర్తి చేసి టెండర్లు పిలవడానికి ఫైల్​రెడీ చేస్తున్నాం. జెన్​కో ఇంజినీర్లు కొద్ది నెలలుగా ఆర్ వీ ఇంజినీరింగ్​ కన్సల్టెన్సీ సంస్థతో కలిసి ప్రాజెక్ట్​పై ఫోకస్​ పెట్టారు.         

 హరీశ్, జెన్​కో సీఎండీ