ప్రపంచ మానవాళికి అత్యుత్తమ జీవన మార్గదర్శిగా ఉన్న భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం. ఇది కురుక్షేత్ర యుద్ధసమయంలో ఆవిర్భవించింది. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరగబోయే సమయంలో శత్రుపక్షంలో ఉన్న తన తాతలు, గురువులు, బంధుమిత్రులను చూసి, అర్జునుడు తీవ్ర విషాదానికి లోనవుతాడు బంధువులను చంపి, రాజ్యం పొందడం ఇష్టం లేక అస్త్రసన్యాసం చేయడానికి సిద్ధపడతాడు.
ఆ సందర్భంలో రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశమే ఈ ‘భగవద్గీత’. ఇది శ్రీ వేదవ్యాస మహర్షి సంస్కృత భాషలో రచించిన మహాభారతమందలి భీష్మ పర్వంలోని 25 నుంచి 42 వరకు గల అధ్యాయాలలో విస్తరించి ఉంది. ఇందులో మొత్తం18 అధ్యాయాలు, 700 శ్లోకాలున్నాయి.
సంస్కృత శ్లోకాలను సామాన్యుల సమీపంలో ఉండడానికి, తెలుగులో ఎందరో కవులు వీటిని ఆటవెలది, తేటగీతి, కందపద్యాలుగా అనువదించారు. ఈజీగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో కథా, వచనాలలో కూడా అనేక పుస్తకాలు వచ్చాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన భగవద్గీత తెలుగునాట ప్రతి ఇంటా మారుమోగుతుంది.
గీతా బోధనను దృశ్య ప్రక్రియలైన బుర్రకథలు, హరికథలు, నాటకాలు, సీరియల్స్ రూపంలోనూ ప్రజలకు చూపించారు. ఆధునిక రచయితలు ఇప్పటికీ వివిధ రూపాల్లో రాసి, పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు.ఇలాంటి భగవద్గీతను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, విశ్రాంత హిందీ భాషోపాధ్యాయుడు కాటేగారు పాండురంగ విఠల్ పూనుకున్నారు.
ఇందుకోసం ఈయన ఆధునిక సాహిత్యంలో వడిచర్ల సత్యం చేత రూపుదిద్దుకుని బహుళ జనాదరణ పొందిన మణిపూసల కవితా ప్రక్రియను ఎంచుకున్నారు. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి ‘గీతా మకరందం’ చదివి ప్రేరణ పొందిన కవి పాండురంగ విఠల్ భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలకు సంబంధించిన సారాంశాన్ని అలతి అలతి పదాలతో దాదాపు1300 మణిపూసల్లో నిక్షిప్తం చేసి, ‘శ్రీమద్భగవద్గీత మణిపూసలు’ పేరుతో సాహితీ ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయం చేశారు. రెండో అధ్యాయంలోని 27వ శ్లోకానికి ఎంత తేలికైన మణిపూసను కూర్చారు.
జాతస్య హి ధృవో మృత్యుర్ధృవం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే ర్థే న త్వం శోచితు మర్హసి|| 2-27.
పుడితే చావు తప్పదు
చస్తే జన్మ తప్పదు
పార్థా! దీన్ని గ్రహించి
నీవు శోకించ తగదు!
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65.
నశించు సకల దుఃఖము
లభించు శాంతి చిత్తము
బుద్ధి స్థిరత సాధిస్తే
కలుగును ఆత్మిక సుఖము!
బుద్ధి స్థిరత్వం సాధిస్తే మనసున దుఃఖము నశించి, శాంతితో పరమోన్నత సుఖం పొందొచ్చని పై శ్లోకమునకు చక్కని వివరణ ఇచ్చారు.
“సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్విద్వాం స్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్|| 3-25.
ఫలాశతో అజ్ఞానులు
ఆచరిస్తారు కర్మలు
ఫలం కోరక హితముకై
కర్మ చేస్తారు జ్ఞానులు!
ప్రతిఫలాపేక్షతో ఏ పనులు చేయకూడదని బోధించిన భగవద్గీత సారాన్ని బాగా చెప్పారు
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్!
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే|| 4-8.
ఈ శ్లోకార్థాన్ని అందమైన మణిపూసగా... శిష్టులను రక్షించుటకు..దుష్టులను శిక్షించుటకు ప్రతియుగమున జనిస్తా!ధర్మాన్ని స్థాపించుటకు!వివరణ అవసరం లేకుండా చిన్న పదాలతో ద్రాక్షాపాకపు శైలిలో ఆకర్షణీయంగా రాయడం విఠల్ ప్రత్యేకత.
ఇలా మరికొన్ని మణిపూసలు చూస్తే..
మనసును నిగ్రహించాలి
గురువులను సేవించాలి
సన్మార్గమున పయనించి
అజేయమ్మును పొందాలి!
మంచి-చెడు గుణముల బట్టి
సుఖదుఃఖ గుణముల బట్టి
జీవుడు జన్మలెత్తును
మంచిచెడు కర్మల బట్టి !
ధర్మస్వరూపమైనది
శాస్త్రజ్ఞానమిచ్చునది
కృష్ణార్జున సంభాషణ
జ్ఞాన -మోక్షములిచ్చునది!
సర్వయజ్ఞ ఫలములు
పుణ్యకార్య ఫలములు
అష్టాదశాధ్యాయము
ఇస్తుంది సద్గతులు!
ఇలా భగవద్గీతలోని శ్లోకాల అర్థం, భావం పాఠకుల మనసుకు సూటిగా, స్పష్టంగా బోధపడేలా మణిపూసలను కూర్చడంలో విఠల్ పాస్ అయ్యారని చెప్పొచ్చు.
- కందుకూరి భాస్కర్-
