వెలుగు స్పెషల్ :ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు ప్రతిభే ప్రామాణికం కావాలి

వెలుగు స్పెషల్ :ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు ప్రతిభే ప్రామాణికం కావాలి

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్టీసీలో సుమారు 1,500 కండక్టర్  పోస్టులను  భర్తీ  చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో..  నియామక విధానంపై  ప్రభుత్వం పునరాలోచించాలని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేస్తోంది.  కేవలం  పదో తరగతి  మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేయడం సరైన విధానం కాదు.  ప్రభుత్వ  ఉద్యోగాల్లో  ప్రతిభ, సామర్థ్యం, పోటీతత్వానికి ప్రాధాన్యం ఉండాలి. అందుకే అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పించే విధంగా రాత పరీక్ష నిర్వహించి,  మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలి.  

పదో తరగతి మార్కులు మాత్రమే ఒక వ్యక్తి ప్రతిభను నిర్ణయించవు.  తక్కువ మార్కులు సాధించిన ఎంతోమంది విద్యార్థులు తరువాత ఉన్నత విద్యలో రాణించి,  గ్రూప్-1,  గ్రూప్-2, సివిల్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ సేవల్లో ఉన్నారు. జీవితంలో ఒక దశలో వచ్చిన మార్కులను  శాశ్వత  ప్రతిభకు కొలమానంగా చూడడం న్యాయం కాదు.  గత రెండు దశాబ్దాలుగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక మార్కులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గ్రామీణ నిరుద్యోగ యువతకు అన్యాయం

గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు అదేస్థాయిలో మార్కులు సాధించడం అనేక కారణాల వల్ల కష్టసాధ్యం.  దీనికి కారణం వారి ప్రతిభ లోపం కాదు.  వారికి అందుబాటులో ఉన్న విద్యా వనరులు, సౌకర్యాలు, అవకాశాల్లో ఉన్న అసమానత.  ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని చెబుతూ మరోవైపు కేవలం పదో తరగతి మార్కులనే ప్రమాణంగా తీసుకుంటే,  పరోక్షంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుంది.  దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన  వేలాదిమంది  పేద, గ్రామీణ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించేవిధంగా రాత పరీక్ష నిర్వహించాలి.  

పరీక్షలో  వచ్చిన మెరిట్,  ప్రభుత్వ రిజర్వేషన్  విధానాన్ని అనుసరించి నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.  అలాగే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ పోస్టుల వివరాలను నోటిఫికేషన్‌‌లోనే స్పష్టంగా వెల్లడించాలి.  రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేయాలి. ప్రత్యేకంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బలహీన వర్గాల పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని మనవి చేస్తున్నాం. 

పోటీ పరీక్షతో ప్రతిభను నిరూపించుకునే అవకాశం

మా విజ్ఞప్తి ఏమిటంటే.. పదో తరగతి మార్కులు అధికంగా వచ్చినవారు ప్రతిభావంతులు కారని కాదు. అయితే, కేవలం ఆ మార్కులనే ఏకైక ప్రమాణంగా తీసుకోవడం వల్ల నిజమైన ప్రతిభకు అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.  పోటీ పరీక్ష నిర్వహిస్తే  ప్రతి అర్హుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. అదే సామాజిక న్యాయం,  పారదర్శకత,  రాజ్యాంగ స్ఫూర్తి.  కాబట్టి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల భర్తీ  విధానాన్ని పునఃపరిశీలించి, రాత పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టి బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నియామక బోర్డుకు కూడా గతంలో మార్కులు,  ప్రస్తుతం గ్రేడింగ్ విధానం ఉన్న తరుణంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  పారదర్శకంగా అర్హతను ప్రకటించి విధివిధానాలను విడుదల చేయాలి.  ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే అందరికీ న్యాయం జరిగి, పారదర్శకంగా భర్తీ జరిగిందనే విశ్వాసం, నమ్మకం నిరుద్యోగులకు కలుగుతుంది. 

- గుండమల్ల సతీష్ కుమార్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.