సగం చెరువులు ఖాళీ.. వాగులు, ప్రాజెక్టులు అడుగంటుతున్నయ్.. ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులు

సగం చెరువులు ఖాళీ.. వాగులు, ప్రాజెక్టులు అడుగంటుతున్నయ్.. ఆదిలాబాద్ జిల్లాలో  కరువు పరిస్థితులు
  •  ఆయకట్టుకు అందని సాగు నీరు
  •  నెర్రలు బారుతున్న పంట భూములు 
  •  ఆందోళనలో రైతన్నలు 

ఆదిలాబాద్, వెలుగు: వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆదిలాబాద్ జిల్లా రైతులను ఎల్​నినో భయపెడుతోంది. ఆరుతడి పంటలే సాగుచేయాలని అధికారులు సూచించినప్పటికీ.. ఊరించిన కొద్దిపాటి వర్షాల కారణంగా ఆనవాయితీగా సాగుచేస్తున్న పంటల వైపే రైతులు మొగ్గు చూపారు. కానీ లోటు వర్షపాతంతో చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నీటి మట్టాలు తగ్గిపోతుండడంతో రైతులకు సాగు కష్టాలు తప్పేలా లేవు. కొద్దిపాటి వర్షాలతో నిండిన నీళ్లు కూడా సాగునీటి అవసరాలకు తోడు ఎండల కారణంగా అడుగంటుతున్నాయి. 

90 శాతం చెరువులు సగం ఖాళీగానే..

సాధారణంగా జిల్లాలో జులై, ఆగస్టులోనే భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి కొద్దిరోజులపాటు కురిసిన భారీ వర్షాలు, కొంత ముసుర్లతో రైతులు సంప్రదాయ సాగు వైపే మొగ్గుచూపారు. కొద్దిరోజులకే పరిస్థితులు మారిపోయాయి. వర్షాల జాడే కనిపించడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం 861.3 మిల్లీమిటర్లు కాగా ఇప్పటి వరకు కురిసింది 597.1 మిల్లీ మీటర్లే. 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

చెరువులు, ప్రాజెక్టులు జలకళ తప్పాయి. జిల్లా వ్యాప్తంగా 280 చెరువులు ఉండగా 90 శాతం చెరువులు సగం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. నీటిని సాగుకు ఉపయోగిస్తుండడం, మరో పక్క ఎండలతో చెరువులు ఖాళీ అవుతున్నాయి. ఏటా ఈ నెలలో నిండుకుండలా తలపించే ప్రాజెక్టులు, చెరువులు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల వాగులు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. సాత్నాల ప్రాజెక్టు మొత్తం 1.24 టీఎంసీలకు గాను 0.981 టీఎంసీలు, మత్తడివాగు ప్రాజెక్టు నీటి మట్టం 0.571 టీఎంసీలకు గాను 0.470 టీఎంసీలే ఉన్నాయి. 

వారంలో వర్షాలు లేకపోతే పంటలకు కష్టమే..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5,94,891 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి కూడా అత్యధికంగా 4,37,698 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సోయా 63,500 వేలు, కంది 57,916 వేలు, మొక్కజొన్న 27 వేల ఎకరాలతోపాటు జొన్న, పెసర, ఇతర పప్పు దినుసులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలు ఎదిగే దశలో ఉన్నాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల నల్లరేగడి భూములు నెర్రలు బారాయి.

ఎదుగు దశలో ఉన్న పంటలకు నీరు ఎంతో కీలకమని, మరో వారంలో వర్షాలు పడకుంటే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మృగశిర కార్తెలోనే 30 శాతం రైతులు విత్తనాలు విత్తుకోగా, మొదటి మూడు వారాల పాటు వర్షాలు లేకపోవడంతో అవి ఎండిపోయాయి. ఆ తర్వాత మళ్లీ విత్తుకున్నారు. మొదట్లోనే నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ వర్షాలు పడకపోతే తీవ్రంగా నష్టపోతామని భయపడిపోతున్నారు.