చంద్రగిరి రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలకు ఏ కష్టం రాకుండా ఎల్లప్పుడూ కాపాడేవాడు. అంతేకాదు చక్కని సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసి, పరిపాలనలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొచ్చి ఇరుగు, పొరుగు రాజ్యాలకు ఆదర్శంగా నిలిచాడు. రాజశేఖరుడి పాలనలో చంద్రగిరి రాజ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సుభిక్షంగా ఉంది. కానీ.. ఆయన జీవితంలో మాత్రం సంతానం లేదనే వెలితి ఉంది. ఎన్ని నోములు నోచినా, పూజలు చేసినా రాణికి సంతానం కలగలేదు. ఇక సంతానం కలగదని ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ వార్త ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసింది. దాంతో ఎక్కడెక్కడినుంచో బంధువులంతా రాజశేఖరుడి రాజ్యానికి చేరి నా బిడ్డను తీసుకో, నా బిడ్డను తీసుకో అన్నారు. రాజశేఖరుడు ఎవరినీ నొప్పించలేక అందరూ అంతఃపురంలోనే ఉండండి. తగిన సమయంలో ఎవరిని దత్తత తీసుకోవాలో నిర్ణయిస్తా అని చెప్పాడు.
దత్తత విషయంలో ఏం చేయాలో రాజశేఖరుడికి తోచలేదు. మహామంత్రి అనంతుడిని పిలిచి సలహా కోరాడు. అనంతుడు దీర్ఘంగా ఆలోచించి రాజశేఖరుడికి ఒక సలహా చెప్పాడు. రాజశేఖరుడు సంతోషంతో తన నివాసానికి వెళ్లాడు. వెళ్లేముందు రేపు జరిగే సమావేశంలో ఎవరిని దత్తత తీసుకునేది చెప్తానని చెప్పాడు.
మరుసటి రోజు రాజశేఖరుడు సమావేశ మందిరానికి వచ్చి తన సింహాసనంపై కూర్చున్నాడు. బంధువులంతా ఎవరికి వాళ్లే రేపటి నుంచి ఆ సింహాసనం తమ బిడ్డదే అనుకుని మురిసిపోయారు. రాజశేఖరుడు. నేను ఎవరి బిడ్డను దత్తత తీసుకోవాలన్నా వాళ్లు ఒక పని చేయాలి అన్నాడు. అందరూ సరేనన్నారు. రాజమందిరంలోని మంత్రులు అధికారులు సైనికులు మహారాజు ఏం చెప్తాడోనని కళ్లార్పకుండా చూడసాగారు.
రాజశేఖరుడు మహామంత్రి అనంతుని వంక చూశాడు. అనంతుడు సైనికులను పిలిచి, వాళ్ల బంధువుల్లో ఒక్కొక్కరి చేతిలో ఒక్కో అన్నం ముద్ద పెట్టమన్నాడు. అన్నం ముద్ద చేతుల్లో పెట్టడం పూర్తయ్యాక రాజు మాట్లాడుతూ గంట మోగగానే మీ చేతిలో ఉన్న అన్నం ముద్దతో, ఎదురుగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలోకి వెళ్లాలి. అక్కడ దేవుడికి నమస్కరించి మొదట ఎవరు అన్నం ముద్ద తింటారో... వాళ్ల కొడుకునే నేను దత్తత తీసుకుంటాను అని చెప్పాడు. బంధువులంతా ఆత్రుతగా ఉన్నారు. గంట మోగడంతో బంధువులంతా పరుగు పెట్టి వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకున్నారు. లోపల దేవుడికి దండం పెట్టుకుని చేతిలో ఉన్న అన్నం ముద్ద తిన్నారు. కానీ.. నేను ముందు తిన్నానంటే...నేను ముందు అని వాదులాడుకున్నారు. తర్వాత రాజశేఖరుడి నిర్ణయం కోసం సమావేశ మందిరానికి వచ్చారు.
కానీ.. బంధువుల్లో ముకుందయ్య అనే అతను మాత్రం తాను ఆలయంలోకి వెళ్లకుండా ఆలయం బయట ఆకలితో ఉన్న ఒక అవ్వకు అన్నం ముద్ద ఇచ్చాడు. బంధువులంతా ఆలయం నుంచి బయటకు వస్తూ ముకుందయ్యను చూసి వెక్కిరిస్తూ రాజమందిరానికి వెళ్లిపోయారు. ఇదంతా రాజు గమనిస్తూనే ఉన్నాడు.
రాజమందిరానికి చేరుకున్న బంధువులందరినీ కూర్చోమని చెప్పి, రాజశేఖరుడు పూలమాల తీసుకెళ్లి ముకుందయ్య మెడలో వేశాడు. బంధువులు ఆశ్చర్యపోయారు. మీరంతా మీ కొడుకుని దత్తత తీసుకోవాలని ఆరాటపడ్డారు. కానీ ముకుందయ్య ఒక అవ్వ ఆకలి తీరిస్తే చాలనుకున్నాడు. అందుకే తాను మీతో పోటీ పడకుండా అన్నం ముద్దను అవ్వకు ఇచ్చాడు. కాబట్టి ఇతనే గొప్పవాడు. అందుకే అతని కొడుకుని దత్తత తీసుకుంటానని ప్రకటించాడు.
బంధువులంతా తమ తప్పును గ్రహించి ముకుందయ్యను అభినందించారు. రాజశేఖరుడు దత్తత తీసుకున్న అబ్బాయికి జయశేఖరుడు అని పేరుపెట్టి విద్యాబుద్ధులు నేర్పించాడు. తర్వాత రాజ్యాన్ని అప్పగించాడు.
-ఉండ్రాల రాజేశం, సిద్దిపేట
