పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగబోదని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల సిలబస్ మార్పు చేసి, వాటిని స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
50 శాతం థియరీ, 50 శాతం ప్రాక్టికల్స్ తో పాటు కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు స్టార్టింగ్‌లోనే 8 వేల రూపాయల స్టైఫండ్ ఇస్తున్నామని, పాలిటెక్నిక్ పూర్తి చేసినవారు నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చేరవచ్చని, జపాన్, జర్మనీ దేశాల్లోనూ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం పాలిటెక్నిక్ విద్యార్థులను, ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తూ బలి చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. విద్యార్థులు అమాయకంగా మోసపోవద్దని, కేకే కమిటీతో చర్చించి తగిన సూచనలు చేయాలని కోరారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి, టాటా సంస్థ సహకారంతో తీర్చిదిద్దుతున్నామని, ఏటీసీ విద్యార్థులకు రూ. 2500 స్టైఫండ్ తో పాటు వేగంగా ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.
ఉపాధ్యాయులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని, ఏ సమస్య ఉన్నా ఉద్యోగ సంఘాలతో చర్చించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పీఆర్సీ బాధ్యత పూర్తిగా తనదేనని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
