దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు వరుస సమ్మెలకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో బ్యాంకు సేవల్లో తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 రోజుల పనిదినాల డిమాండ్, పీఎల్‌ఐ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు.
ముందుగా సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో కూడా వరుసగా సమ్మె నిర్వహించనున్నారు షెడ్యూల్ ప్రకారం. అప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రాకపోతే.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని UFBU హెచ్చరించింది. ఈ యూనియన్ల పరిధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్, విదేశీ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలనేది ఒకటి. అంటే శనివారం, ఆదివారం 2 రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనికి బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగులు అంగీకరించారు. అయితే 2024లోనే దీనికి అంగీకారం కుదిరినప్పటికీ.. ఇప్పటివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ALSO READ : ఉద్యోగం మానేసినా 58 ఏళ్ల వరకూ పీఎఫ్ డబ్బుపై వడ్డీ వస్తుందా?
మరోవైపు సీనియర్ బ్యాంక్ అధికారుల కోసం తీసుకొచ్చిన కొత్త పనితీరు ఆధారిత ప్రోత్సాహక(PLI) విధానాన్ని యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఏకపక్షంగా, వివక్షపూరితంగా ఉందని ఆరోపించారు. పాత పద్ధతిలో బ్యాంకు లాభాల ఆధారంగా అందరికీ గరిష్టంగా 15 రోజుల వేతనం వరకు ఇన్సెంటివ్ లభించేది. కానీ కొత్త ఫార్ములాల ప్రకారం స్కేల్ IV నుంచి VII అధికారులకు ఏకంగా 365 రోజుల శాలరీ వరకు ప్రోత్సాహకాలు దక్కే అవకాశం ఉందని, మిగతా 95 శాతం ఉద్యోగులకు కేవలం ఒక్క రోజు వేతనం మాత్రమే పరిమితం చేయడం అన్యాయమని యూనియన్లు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
