భూ యజమానులను కలవరపెడుతున్న అత్యంత కీలకమైన అంశం రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22-A. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, అన్యాక్రాంతం కాకుండా కాపాడటం ఈ నిబంధన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అయితే రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక పొరపాట్లు కారణంగా వేలాదిమంది అమాయక పౌరుల ప్రైవేట్ పట్టా భూములు సైతం ఈ నిషేధిత జాబితాలో చేరిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు తమ సొంత స్థలాలను విక్రయించలేక, బ్యాంకు రుణాలను పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాల సంరక్షణ ఎంత అవసరమో, మరోవైపు సామాన్యుల హక్కుల పరిరక్షణ కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒక సర్వే నంబర్ విభజనలో జరిగే చిన్నపాటి పొరపాటు మొత్తం కాలనీల మీద, బహుళ అంతస్తుల నివాస సముదాయాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. బ్యాంకులు సైతం ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు గృహ రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తుండటంతో, రియల్ ఎస్టేట్ రంగం కూడా పరోక్షంగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల నివాస స్థలాల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయి, అత్యవసర వైద్య చికిత్సలు లేదా పిల్లల చదువుల కోసం ఆస్తులను అమ్ముకుందామన్న సామాన్యులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చట్టబద్ధమైన ఐదు రకాల వర్గీకరణ
ఈ చట్టం కింద భూములను ఐదు రకాలుగా వర్గీకరించారు. మొదటిది సెక్షన్ 22-A(1)(a) కింద అసైన్డ్, ప్రభుత్వ భూములు వస్తాయి. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ భూములు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, స్వాతంత్ర్య సమరయోధులు లేదా మాజీ సైనికులకు కేటాయించిన భూములు దీని పరిధిలో ఉంటాయి. ఈ భూములపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. రెండోది సెక్షన్ 22-A(1)(b) కింద ప్రభుత్వ సంస్థల భూములు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందిన భూములు దీనికి చెందుతాయి.
ఆయా సంస్థలకు సంబంధించిన అధీకృత అధికారి ప్రత్యేక అనుమతి ఇస్తే తప్ప ఈ భూముల రిజిస్ట్రేషన్ జరగదు. మూడోది సెక్షన్ 22-A(1)(c) కింద దేవాదాయ, వక్ఫ్ భూములు వస్తాయి. హిందూ దేవాలయాలు, మఠాలకు చెందిన దేవాదాయ ఆస్తులు, మసీదులు, ఈద్గాలు, స్మశాన వాటికలకు చెందిన వక్ఫ్ బోర్డు భూములు, చర్చి ఆస్తులు. ప్రైవేట్ వ్యక్తులు ఈ దైవ నిధులను కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి వీల్లేదు. నాలుగోది సెక్షన్ 22-A(1)(d) కింద మిగులు భూములు వస్తాయి. ల్యాండ్ సీలింగ్ చట్టం పరిమితి కంటే ఎక్కువ ఉన్నందున ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూములు దీని కిందకు వస్తాయి. ఐదవది సెక్షన్ 22-A(1)(e) కింద కోర్టు వివాదాలు, ప్రత్యేక నోటిఫికేషన్ భూములు వస్తాయి. ప్రభుత్వ ప్రజా ఉపయోగ స్థలాలు, చెరువులు, రోడ్లు, ఉద్యానవనాలు, కోర్టుల ద్వారా జప్తు అయిన లేదా స్టే ఆర్డర్ ఉన్న ఆస్తులు దీని పరిధిలో ఉంటాయి. మోసపూరిత విక్రయాలను అరికట్టడానికి, కోర్టు ఆదేశాలను గౌరవించడానికి ఈ భూముల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేస్తారు.
పరిష్కార మార్గాలు
బాధిత పౌరులు తమ ఆస్తులను ఈ కఠినమైన జాబితా నుంచి తొలగించుకోవడానికి ప్రభుత్వం ఒక మార్గాన్ని సూచించింది. మొదటగా పౌరులు అధికారిక పోర్టళ్ల ద్వారా తమ సర్వే నంబర్ల స్థితిని పరిశీలించుకోవాలి. ఆస్తి ఏ ఉప-సెక్షన్ కింద నిలిపివేయడమైనదో స్పష్టమైన కారణాన్ని తెలుసుకోవడం అత్యవసరం. ఆ తరువాత సరైన పత్రాలతో కూడిన దరఖాస్తును సంబంధిత ఆన్‌లైన్ మాడ్యూల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు పట్టాదార్ పాస్‌బుక్, రిజిస్టర్డ్ సేల్ డీడ్, ముప్పైఏళ్ల ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, మ్యుటేషన్ కాపీ అలాగే కోర్టు తీర్పు కాపీలను పీడీఎఫ్ రూపంలో సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత భూభారతి పోర్టల్ ద్వారా సిటిజన్ లాగిన్ అయి, ఆర్‌ఓఆర్ కరెక్షన్స్ ఆప్షన్ ఎంచుకుని, గ్రీవెన్స్ మాడ్యూల్ కింద దరఖాస్తు చేయాలి. జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి, అవి నిజమైన ప్రైవేట్ భూములని నిర్ధారించిన తర్వాత జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
అధికారులు స్పష్టమైన గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన పత్రాలను సమగ్రంగా పరిశీలించి, అధికారుల మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించడం ద్వారా అదనపు ఆలస్యాన్ని నివారించవచ్చు. ప్రతి దరఖాస్తు స్థితిపై ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ లేదా ఆన్‌లైన్ నోటిఫికేషన్ల ద్వారా సమాచారం అందించడం వల్ల ప్రజలలో అనవసరమైన ఆందోళన తొలగిపోతుంది. అధికారుల పరిశీలన సమయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పారదర్శక విచారణ జరిపి, పాత రికార్డులను సరిపోల్చి అమాయక పౌరుల దరఖాస్తులు అనవసరంగా తిరస్కరణకు గురికాకుండా నివారించవచ్చు.
డిజిటల్ పొరపాట్లు
డిజిటల్ మ్యాపింగ్‌లో తలెత్తిన సాంకేతిక వ్యత్యాసాల కారణంగా అనేకమంది బాధ్యతగల పౌరులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒక సర్వే నంబర్ పరిధిలో చిన్న భాగం ప్రభుత్వ భూమిగా ఉంటే, అదే సర్వే నంబర్‌లోని మిగిలిన వందలాది ఎకరాల ప్రైవేట్ భూమిని కూడా పొరపాటున ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరుగుతోంది. దీనివల్ల ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడని సాధారణ పౌరులు సైతం శిక్షను అనుభవించేటట్లు పరిస్థితులు మారుతున్నాయి. పౌరులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోవడం వల్ల సామాన్యులకు ఊరట లభించడం లేదు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ తప్పులను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వలన సామాన్య ప్రజలు అనవసరమైన ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటూ తమ కష్టపడిన సంపాదనను కోల్పోతున్నారు.
- డా. కట్కూరి
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
