- సెమిస్టర్‌కు రూ.100.. ఏటా రూ.200 బాదుడు
- డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల నుంచి కలెక్షన్
- ఏటా 2.5 లక్షల మంది నుంచి రూ. కోట్ల వసూలు
- ఎగ్జామ్ ఫీజులోనే కలిపి గుంజుతూ.. ఓయూ ఆఫీసర్ల చీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు పేరుతో అడ్డగోలు వసూళ్లు సాగుతున్నాయి. ప్రస్తుతం కాలేజీలు పెట్టుకున్న అటెండెన్స్ మిషన్లతో లింకు చేయకపోయినా.. విద్యార్థులను ముక్కుపిండి పైసలు వసూలు చేస్తున్నారు. బయోమెట్రిక్ మాటే వినిపించని కాలేజీల్లో కూడా ప్రతి సెమిస్టర్‌కు రూ. 100 చొప్పున.. ఏటా రూ. 200 గుంజుతున్నారు. గత ఆరేండ్లుగా ఈ వసూళ్ల పర్వం కొనసాగుతున్నా.. కనీసం వాటిని లింకు చేయించే ఆలోచన ఆఫీసర్లలో కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, బీఈడీ, లా వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఏటా సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు చేరుతున్నారు. వీరందరి నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.100 చొప్పున బయోమెట్రిక్ ఫీజు వసూలు చేస్తుండగా.. కేవలం ఒక సెమిస్టర్‌కే యూనివర్సిటీకి రూ. 2.5 కోట్ల ఆదాయం వస్తోంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి, ఒక్కో స్టూడెంట్ నుంచి రూ. 200 చొప్పున ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లను వర్సిటీ అధికారులు గుంజుతున్నారు. ఈ భారీ మొత్తాన్ని నేరుగా అడగకుండా, ఎగ్జామ్ ఫీజులో కలిపి వసూలు చేస్తున్నారు. ఆరేండ్లుగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది.
ఆరేండ్లుగా ఇదే తంతు..
2020–-21 విద్యా సంవత్సరంలో ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ డివైస్‌లను బిగించారు. దీనికి మేనేజ్మెంట్ల నుంచే డబ్బులు వసూలు చేశారు. అప్పట్లో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ హాజరు విధానం కొన్ని రోజులకే అటకెక్కింది. మిషన్లు మూలనపడి దుమ్ము పడుతున్నా, సర్వర్లు పనిచేయకపోయినా వసూళ్లు మాత్రం ఏనాడూ ఆగలేదు. ఎప్పుడూ ఏ కాలేజీలో ఎంతమంది అటెండ్ అయ్యారనే వివరాలనూ అందించలేదు. గడిచిన ఆరేండ్లుగా ప్రతి విద్యార్థి నుంచి పైసలు వసూలు చేస్తూ వర్సిటీ ఖజానాను నింపుకుంటోంది తప్ప, విద్యార్థులకు బయోమెట్రిక్ సౌకర్యాన్ని మాత్రం కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్ము ఏమైందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
