ఈ ఏడాది సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతారన్న అంచనాలు, భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గల్వాన్ ఘర్షణ దరిమిలా భారత్–చైనా సంబంధాలు కనిష్ట స్థాయికి క్షీణించాయి. సరిహద్దులో సైనిక ఉద్రిక్తతలు, భారత్ దీటైన ప్రతిచర్య, పరస్పర అనుమానాలు, భూభాగం ఆక్రమణ ఆరోపణలు, చైనా పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు ఇవన్నీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయి నాయకత్వం మళ్లీ ఒకే వేదికపైకి రావడం, ఇరుదేశాల మధ్య సంబంధాలను కొంత సాధారణ స్థితికి తీసుకురావడానికి జరుగుతున్న చిరు ప్రయత్నంగా చూడవచ్చు.
అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత స్నేహం ఎంత అరుదో, శాశ్వత శత్రుత్వం కూడా అంతే అరుదు. పరిస్థితులకు అనుగుణంగా దేశాల ప్రాధాన్యతలు కూడా మారతాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత కఠినంగా వ్యవహరించడం అప్పటి అవసరం. సంభాషణను పునరుద్ధరించడం ఈనాటి వాస్తవిక దృక్పథం. సరిహద్దులో క్రమంగా స్థిరత్వం ఏర్పడటం, ఉన్నతస్థాయి దౌత్య సంబంధాలు తిరిగి పుంజుకోవడం, పరస్పర వాణిజ్య అవసరాలు, బహుళపక్ష వేదికల్లో ఉమ్మడి ప్రాధాన్యతలు - ఇవన్నీ ఈ స్వల్ప మార్పుకు కారణాలు. అయితే ‘సంభాషణ’ను నమ్మకం పునరుద్ధరణగా, ‘సంబంధాల సాధారణీకరణ’ను సరిహద్దు వివాదం పరిష్కారంగా భావించడం తొందరపాటే అవుతుంది.
అవసరమైనచోట సహకారం
సరిహద్దులో భద్రతా దళాలు ఎదురెదురుగా మోహరించి ఉన్నప్పటికీ, కొన్ని కీలక మార్గాల్లో వాణిజ్యం, తీర్థయాత్రలు జరగడం భారత్–చైనా సంబంధాల సంక్లిష్టతకు నిదర్శనం. ఉదాహరణకు లిపులేఖ్ కనుమ ద్వారా మానస సరోవర్ యాత్ర, స్థానిక వాణిజ్యం జరుగుతుంటాయి. అలాగే కొవిడ్ సమయంలో మూతపడిన నాథూలా పర్వత కనుమ మార్గం ద్వారా మానస సరోవర్ యాత్ర పునరుద్ధరించడంతోపాటు, 2026 ఆగస్టు నుంచి పాత సిల్క్ రూట్ ద్వారా సరిహద్దు వాణిజ్యం కూడా పునఃప్రారంభమైంది. వాణిజ్యంతోపాటుగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, స్థానిక ప్రజల జీవనోపాధి, తీర్థయాత్రలు, దౌత్యం - అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందువల్ల సరిహద్దులో భద్రతాపరమైన అప్రమత్తతను కొనసాగిస్తూనే, స్థానిక ప్రయోజనాలు, దౌత్య సంభాషణల కోసం కొన్ని మార్గాలను తెరిచి ఉంచడం భావ వైరుధ్యం కాదు, సమయస్ఫూర్తితో కూడిన భారత దౌత్యనీతికి నిదర్శనం.
ఆర్థికంగా దగ్గర... రాజకీయంగా దూరం
రాజకీయంగా, వ్యూహాత్మకంగా చైనాపై భారత్ పూర్తి అప్రమత్తతతో ఉంది. అనుమానపు ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కానీ, 2025–26లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 151.1 బిలియన్ డాలర్లకు చేరడంతో భారత వాణిజ్య లోటు 112.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. రాజకీయంగా ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాన్ని కూడా చూడాలి. ముఖ్యంగా తుది ఉత్పత్తుల దిగుమతుల కంటే భారతదేశంలోనే తయారవుతున్న అనేక తుది ఉత్పత్తులకు అవసరమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు, యంత్రాలు, ఔషధ ముడిపదార్థాలు, బ్యాటరీలు వంటి మధ్యంతర వస్తువులు చైనా నుంచి రావడం మన ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే అంశం. అందుచేత ప్రత్యామ్నాయ ఉత్పత్తి సామర్థ్యం, సరఫరాదారుల వ్యవస్థ, సాంకేతిక నైపుణ్యం దేశంలో పూర్తిస్థాయిలో ఏర్పడకముందే చైనా దిగుమతులపై ఆంక్షలు విధించడం భారత్‌కు మేలు కంటే కీడు చేసే ప్రమాదం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ పూర్తిస్థాయిలో నిలదొక్కుకున్నప్పుడే ఇటువంటి నిర్బంధ విధానాలు అక్కరకు వస్తాయి. ఈ కఠోర వాస్తవాన్ని గుర్తించకుండా చైనాతో ఆర్థిక సంబంధాలను ఒక్కసారిగా తెంచుకోవాలని పట్టుబట్టడం కేవలం ఒక నినాదంగా లేదా విశాల దృక్పథం లోపించిన జాతీయతావాదంగానే మిగిలిపోతుంది.
అరుదైన రేర్ ఎర్త్ ఖనిజాలు
విద్యుత్ వాహనాలు, అధునాతన ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో వాడే శాశ్వత అయస్కాంతాల తయారీకి రేర్ ఎర్త్ ఖనిజాలు అత్యంత కీలకం. వీటి లభ్యత కంటే వాటిని శుద్ధిచేసే సరఫరా గొలుసుపై చైనాకు భారీ ఆధిపత్యం ఉంది. ఈ రంగంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితిని మార్చే దిశగా 2026–27 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడుల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి తోడు రూ.7,280 కోట్ల బృహత్తర పథకం కింద దేశంలో ఏటా 6,000 మెట్రిక్ టన్నుల శాశ్వత అయస్కాంతాల తయారీ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. విశాఖపట్నంలో ఇప్పటికే స్వదేశీ సాంకేతికతతో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో నియోడిమియం– ఐరన్– బోరాన్ అయస్కాంతాల పైలట్ ప్లాంట్ కూడా ఏర్పాటైంది. అయితే దీర్ఘకాలికంగా ఏర్పడే ఈ మౌలిక సదుపాయాలు పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని చేరుకునే వరకూ చైనాపై ఎంతోకొంత ఆధారపడక తప్పదు. అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు కూడా తమ సొంత ఉత్పత్తి, శుద్ధి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూనే చైనా
సరఫరాపై ఆధారపడుతున్నాయి.
చైనాతో తెగతెంపులు చేసుకోవడం కాదు
చైనాతో సంపూర్ణ ఆర్థిక విభజన ఇప్పట్లో ఆచరణ సాధ్యంకాదు అనేది చేదు నిజం. అయితే చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించడమే ఆచరణ
యోగ్యమైన పరిష్కారం. ఇదే లక్ష్యంతో అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా+1’ వ్యూహంలో ‘1’ స్థానాన్ని భారత్ దక్కించుకోవాలంటే, మార్కెట్ పరిమాణంతోపాటు మౌలిక వసతులు, పోటీ సామర్థ్యం, నైపుణ్యం, సరఫరాదారుల వ్యవస్థ, విధాన స్థిరత్వం కూడా అవసరం. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రపంచం నుంచి దూరంగా నిలబడటం కాదు. ప్రపంచ సరఫరా గొలుసులో మరింత లోతుగా ప్రవేశించేంత పోటీ సామర్థ్యాన్ని దేశీయంగా నిర్మించుకోవడం.
అమెరికా-చైనా మధ్య భారత్
అమెరికాతో సాంకేతిక, రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూనే, చైనాతో అవసరమైన దౌత్యాన్ని కొనసాగించడం సమతుల్యతతో కూడిన భారత విదేశాంగ విధానానికి నిదర్శనం. ‘అమెరికా వైపా? చైనా వైపా?’ అనే ఏకపక్ష వైఖరి దీర్ఘకాలంలో చెరుపు చేస్తుంది. అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకోవడం చైనాను ఎదుర్కోవడానికి మాత్రమే ఉపయోగపడే సాధనంగా మారకూడదు. అలాగే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం అమెరికా నుంచి దూరం కావడానికీ సంకేతం కాకూడదు. రెండు సంబంధాలను భారత ప్రయోజనాల ఆధారంగా విడివిడిగా నిర్వహించగలగడమే భారత దౌత్య చతురతకు నిదర్శనం.
ముందున్న అసలు లక్ష్యం
సరిహద్దులో అప్రమత్తత కొనసాగుతూనే, అవసరమైనచోట సంభాషణకు ఏర్పడిన అవకాశాలను మరింత విస్తృతం చేసుకోవాలి. ఆర్థికంగా చైనాపై అతిగా ఆధారపడే పరిస్థితిని తగ్గించడంతోపాటు, చైనా నుంచి బయటకు వస్తున్న తయారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశీయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రపంచ సరఫరా గొలుసులో చైనాకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా చెప్పుకోదగ్గ స్థానాన్ని సంపాదించడం, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం, బ్రిక్స్‌లో చురుకైన పాత్ర పోషించడం - ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన లక్ష్యాలు కావు. నొప్పించక, తానొవ్వక అన్న రీతిలో ఈ అంశాలను సమన్వయం చేయగలగడమే భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి, సంయమనంతో కూడిన దౌత్యనీతికి అసలు పరీక్ష.
బ్రిక్స్ వేదికలో మరో పరీక్ష
బ్రిక్స్ వేదికగా ప్రపంచ దక్షిణ దేశాల ప్రయోజనాలు, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం వంటి అంశాల్లో భారత్ కలిసి పనిచేస్తున్నప్పటికీ, డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో చైనా ఆర్థిక ఆధిపత్యానికి దారితీసే ‘సామూహిక బ్రిక్స్ కరెన్సీ’ని భారత్ ప్రోత్సహించడం లేదు. ఇది చైనా వ్యతిరేకత లేదా అమెరికా అనుకూలత కాదు. పూర్తిగా భారత స్వీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. ఒకరి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు మరొకరి గుత్తాధిపత్యాన్ని అంగీకరించకపోవడమే సందర్భోచితమైన నిర్ణయం. గల్వాన్ ఘర్షణ తర్వాత భద్రత దృష్ట్యా కఠిన వైఖరి అవసరమైంది. వ్యూహాత్మక ప్రయోజనం సాధించాం కూడా. అయితే నేడు మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సంభాషణను పునరుద్ధరించడం ప్రస్తుత అవసరం. దీనిని ‘యూ టర్న్’ పేరుతో అపహాస్యం చేయడం కంటే, దౌత్య ప్రాధాన్యతల్లో సాధించిన సమతుల్యతగా చూడాలి. విదేశాంగ విధానంలో పరిస్థితులను బట్టి సాధనాలు మారుతాయి తప్ప, దేశ ప్రయోజనాలు మారవు.
కృష్ణ బాలాజీ
పల్లపోతు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
