సాగర్ నీళ్లు వదలకుంటే పాదయాత్ర :కేటీఆర్

సాగర్ నీళ్లు వదలకుంటే పాదయాత్ర :కేటీఆర్
  • 14లోపు ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వాలి  
  • లేకుంటే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా
  • మిర్యాలగూడ రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఎప్పుడు, ఎంత మేరకు సాగు నీరు విడుదల చేస్తారో ఈ నెల14లోపు షెడ్యూలు ప్రకటించాలని, లేకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​అన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.

సాగర్‌‌లో 180 టీఎంసీల నీరున్నా ఎడమ కాలువకు నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. నిన్నటికి కాంగ్రెస్‌‌ వెయ్యి రోజుల దుష్టపరిపాలన పూర్తయిందని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యభాండాగారంగా మారిందన్నారు. వరి దిగుబడిలో తెలంగాణలో నల్లగొండ నంబర్‌‌వన్‌‌గా నిలిచిందని, శ్రీశైలంలో 537 అడుగుల నీరు ఉందని, సాగర్‌‌లో నీళ్లు ఉన్నా జిల్లా మంత్రులకు సోయి లేక పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్​విమర్శించారు. 

14 తర్వాత కార్యాచరణ.. 

మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి తెలంగాణ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి వాటర్‌‌ కలిస్తే సొరంగం కూలిపోయిందని అంటున్నారని విమర్శించారు. శ్రీశైలంలో జలవిద్యుత్‌‌ ఉత్పత్తి ద్వారా 40 నుంచి 50 టీఎంసీల నీరు సాగర్‌‌లోకి వచ్చినా మంత్రులు చూడడంలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ కింద మన నీటికి సీఎం రేవంత్‌‌రెడ్డి ఏపీకి వదిలిపెడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్‌‌ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడుగుతామన్నారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీందర్ నాయక్, గాదరి కిశోర్ పాల్గొన్నారు.

 డిసెంబర్‌‌‌‌ తర్వాత కేసీఆర్ బస్సుయాత్ర

వచ్చే డిసెంబర్ తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర, తన పాదయాత్ర ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు. నల్గొండ పర్యటన సందర్భంగా ఆయన మీడియా చిట్‌‌చాట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దూకుడుగా వ్యవహరిస్తే బాగుండదని ఇన్నాళ్లు వేచి చూశామని, ఈ ఏడాది డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ వచ్చి మూడేళ్లవుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్119 నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. తాను ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని.. ఏడు నుంచి ఎనిమిది నెలలపాటు ఈ యాత్ర ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈసారి గెలిచేవారికే టికెట్లు ఇస్తామన్నారు. డీలిమిటేషన్ జరగకపోయినా విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, అసెంబ్లీ స్థానాలు పెంచక తప్పదన్నారు.