న్యూఢిల్లీ, వెలుగు: రైల్వే శాఖలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్ భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో, బోర్డు సభ్యులు, జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లు (జీఎంలు), డైరెక్టర్ జనరల్స్ (డీజీలు), డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో రైల్వే భద్రతకు సంబంధించి మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిగ్నలింగ్‌కు సంబంధించిన సాంకేతిక లోపాలను మిషన్ మోడ్‌లో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే నిర్ణీత సేవా కాలం పూర్తి చేసుకున్న ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్ఈ) భాగాలను గుర్తించి, వాటి నిర్వహణ, మార్పిడి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్క్‌షాప్‌లలో కోచ్‌ల నిర్వహణపై, ముఖ్యంగా అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించిన ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, వైరింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాగన్‌లు, కోచ్‌లకు సంబంధించిన కప్లర్లు, వీల్స్ నిర్వహణను కూడా మెరుగుపరచాలని చెప్పారు. ట్రాక్ నిర్వహణ విషయానికి వస్తే పాయింట్ మెషిన్లు, టర్నౌట్లు, ఫాస్టెనర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఫాస్టెనర్లు లేకపోతే వెంటనే వాటిని అమర్చే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
