40షిప్పులు హార్మూజ్ దాటినయ్..యూఎస్ బలగాల రక్షణలో తరలిన నౌకలు

40షిప్పులు హార్మూజ్ దాటినయ్..యూఎస్ బలగాల రక్షణలో తరలిన నౌకలు
  • కోటి 80 లక్షల బ్యారెళ్ల చమురు బయటకు తరలింపు 

వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి గుండా కోటి 80 లక్షల బ్యారెళ్ల చమురును మోసుకెళ్తున్న 40 వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం మంగళవారం సురక్షితంగా బయటకు దాటించింది. అమెరికా బలగాల రక్షణ మధ్య ఆ షిప్పులు జలసంధిని దాటి బయటకు వచ్చాయని ‘సీఎన్ఎన్’ బుధవారం వెల్లడించింది. ఆరు నెలల క్రితం ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైన తర్వాత నుంచి హార్మూజ్ గుండా ఇంత భారీగా చమురు రవాణా కావడం ఇదే తొలిసారి అని తెలిపింది. 

సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ఈ ఆపరేషన్‌‌‌‌లో భాగంగా జలసంధి చుట్టుపక్కల ఉన్న ఇరాన్‌‌‌‌కు చెందిన సుమారు 60 సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ గగనతల రక్షణ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, సముద్ర ఆస్తులు, మైన్‌‌‌‌లను అమర్చే పడవలు, కమ్యూనికేషన్ ఇన్‌‌‌‌స్టాలేషన్స్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ ఎస్కార్ట్ ఆపరేషన్ సమయంలో అమెరికా బలగాలు అనేక యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను కూడా ధ్వంసం చేశాయి. 

రాబోయే రోజుల్లో ఈ జలసంధి సమీపంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే, యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజువారీగా సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. సోమవారం కూడా కోటి 70 లక్షలకు పైగా బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా తరలిందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు.