హైదరాబాద్ సిటీ, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2024 సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం గురువారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఘనంగా జరిగింది. వివిధ సాహితీ ప్రక్రియల్లో విశేష కృషి చేసిన రచయితలు, కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్నందిని సిధారెడ్డి అవార్డులను ప్రదానం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఒక సాహిత్యకారుడు చేస్తున్న అశేషమైన సాహిత్య ప్రయాణంలో లభించే పురస్కారం ఎక్కువ కాలం కీర్తివంతంగా వెలుగుతుందన్నారు. వీసీ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య చరిత్రలో వర్తమాన అధ్యాయం సిధారెడ్డి అని అన్నారు.
వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. సాహిత్య రంగానికి విశేష సేవలందిస్తున్న తెలుగు రచయితలను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో నెల్లుట్ల శ్రీకాంత్, ప్రొఫెసర్లు, సాహితీవేత్తలు, స్టూడెంట్స్, సాహిత్యాభిమానులు
పాల్గొన్నారు.
