న్యూఢిల్లీ: గత నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో తన పబ్లిక్ మీటింగ్ జరిగిన ప్రదేశంలో చేపట్టిన ‘శుద్ధీకరణ’ కార్యక్రమం అంటరానితనం కిందకే వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ఆదేశించాలని రాజ్యసభ సభ లీడర్ జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు ఖర్గే ఆయనకు లేఖ రాశారు.
ఆగస్టు 13న తాను ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినప్పుడు.. విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని నడ్డా హామీ ఇచ్చారని ఖర్గే గుర్తుచేశారు. ఆగస్టు 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో తన ర్యాలీ ముగిసిన తర్వాత ఆగస్టు 11న కొందరు వ్యక్తులు అక్కడ ‘శుద్ధీకరణ యజ్ఞం’ నిర్వహించారని, ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, మానవ హక్కులకు విరుద్ధమని లేఖలో ఆయన పేర్కొన్నారు.
గురువారం మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగి 24 రోజులు గడిచినా ఇప్పటివరకూ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దళితులు, మహిళలు, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని లేదా రాహుల్ గాంధీని భయపెట్టడానికే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని.. అయితే, తాము దీనికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవనున్నట్టు ఖర్గే వెల్లడించారు.
