- భారీ ప్రాజెక్టులు ప్రకటించిన తమిళనాడు సీఎం విజయ్
- ప్రత్యేక ఎఫ్1 నుంచి ఎఫ్ 4 మోటార్ రేసింగ్ సిటీ
- ఒలింపియన్లను తయారు చేయడమే లక్ష్యమని వెల్లడి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేలా ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ రెండు కీలక ప్రకటనలు చేశారు. చెన్నైలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తమిళనాడు ఒలింపిక్ సిటీ, ప్రత్యేకంగా మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఒలింపిక్ సిటీలో అత్యాధునిక క్రీడా వసతులు, శిక్షణ కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సదుపాయాలతో పాటు క్రీడాకారులు, కోచ్‌లకు వసతి కల్పించనున్నారు.
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ సిటీని నిర్మించనున్నారు. ఇందులో స్పోర్ట్స్ అరేనాలు, ఆధునిక పరికరాలు, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లు ఉంటాయి. క్రీడాకారులు, కోచ్‌లకు రెసిడెన్షియల్ సదుపాయాలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రైనింగ్ఇచ్చి తమిళనాడు నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడం దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ సిటీ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించుకోవచ్చని విజయ్ చెప్పారు. చెన్నైలోనే ప్రత్యేక మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్ ట్రాక్, ఆధునిక మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు కల్పిస్తారు. ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4 వంటి అంతర్జాతీయ రేసులను నిర్వహించేలా దీనిని తీర్చిదిద్దుతారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి రేసర్లుగా తయారు చేస్తామని విజయ్ తెలిపారు.
టూరిజం.. పరిశ్రమలకు బూస్ట్
ప్రపంచ స్థాయి రేసింగ్ వేదికలు అందుబాటులోకి వస్తే చెన్నైకి టూరిస్టులు పెరుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే స్పెషల్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు అవకాశాలు పెరగడంతోపాటు కొత్త ఉద్యోగాలు వస్తాయని విజయ్ చెప్పారు. మోటార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన ఇతర వ్యాపారాలు, సేవలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
