- అండర్ పాస్ లు లేకపోవడంతో రోడ్డు దాటేందుకు ప్రజల ఇబ్బందులు
- యూ టర్న్ కోసం రెండు, మూడు కిలోమీటర్ల పయనం
- వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతుల తంటాలు
- అండర్ పాస్ లు నిర్మించాలని ఆందోళనలు
వరంగల్- కరీంనగర్ నేషనల్ హైవే-563 ఫోర్ లైన్ డిజైనింగ్ లోపం ప్రజలకు శాపంగా మారింది. హైవే వెంట ఉన్న గ్రామాలను దృష్టిలో పెట్టుకోకుండా రోడ్డు వేయడం, ఊళ్లున్న చోట అప్రోచ్ రోడ్లు, అండర్ పాస్ లు నిర్మించకపోవడంతో చాలా చోట్ల గ్రామాలు రెండు ముక్కలయ్యాయి. దీంతో జనాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దాటాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలాల వద్దకు వెళ్లే రైతులు, ఎడ్లు, బర్లు, గొర్లను మేపడానికి వెళ్లే వారు అరిగోస పడుతున్నారు. అత్యంత వేగంగా వచ్చే వాహనాలను తప్పించుకోవడం ఒక ఎత్తయితే... కాలినడకన రోడ్డు దాటాల్సిన వారి బాధలు వర్ణనాతీతం. ఇవీ.. ఎల్కతుర్తి మండలంలోని బావుపేట, సూరారం, శాంతినగర్, జీల్గుల, జగన్నాథపూర్ గ్రామాల ప్రజల కష్టాలు.
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : నేషనల్ హైవే-563లో కరీంనగర్ నుంచి వరంగల్ వరకున్న 68 కిలోమీటర్ల రోడ్డును ఫోర్ లైన్ గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,147 కోట్లతో పనులు చేపట్టింది. ఈ మేరకు కరీంనగర్= -వరంగల్ సెక్షన్ లో ఐదు చోట్లా బైపాస్‌లు, 9 మేజర్బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, రెండు ఆర్వోబీలు, మరో 28 చోట్ల అండర్‌పాస్ లు నిర్మించేందుకు ప్లాన్ చేసింది. అయితే హైవే వెంట ఉన్న గ్రామాలు, అక్కడి నుంచి వెళ్లే వాహనాలను దృష్టిలో పెట్టుకుని ప్రపోజల్స్ రెడీ చేయాల్సిన ఆఫీసర్లు అవగాహనరాహిత్యంతో వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల మధ్య నుంచి రోడ్డు ఉండగా అక్కడ ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగించేందుకు అండర్ పాస్ ల నిర్మాణాన్ని ప్రతిపాదించలేదు. అవసరం లేని చోట అండర్ పాస్ లు ప్రతిపాదించడంతో జనాలు, వాహనదారులపై దూరభారం పడుతోంది.
ప్లానింగ్ లోపంతో పెరిగిన సమస్యలు
ఎల్కతుర్తి మండలం బావుపేట క్రాస్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తే.. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేది. కానీ ఆఫీసర్లు దాదాపు కిలోమీటర్ దూరంలో అండర్ పాస్ నిర్మించారు. ఇలా చాలాచోట్లా సమస్యలు తలెత్తగా 2024 నవంబర్ లో 'వెలుగు' పేపర్ లో 'ప్లానింగ్ లోపం.. ప్రజలకు శాపం' అనే కథనం పబ్లిష్ అయ్యింది. దీంతో మేల్కొన్న ఎన్ హెచ్ఏఐ అధికారులు కొత్తగా వల్భాపూర్, కోతులనడుమ గ్రామాల వద్ద రెండు అండర్ పాస్ లు నిర్మించారు.
ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల, జగన్నాథపూర్ గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం కోతులనడుమ గ్రామం మీదుగానే హుజూరాబాద్ కు వెళ్తుంటారు. కానీ కోతులనడుమ వద్ద వాగు కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో హుజురాబాద్ వైపు నుంచి జీల్గులకు వెళ్లాల్సిన వాహనాలు, జనాలు నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. అంత దూరభారం భరించలేక కోతులనడుమలో వాగు దాటి, అండర్ పాస్ ద్వారా తిరిగి జీల్గుల స్టేజీకి చేరుకుంటుండగా.. మరికొంతమంది పెంచికల్ పేట స్టేజీ నుంచి హైవేపై నాలుగు కిలోమీటర్ల మేర రాంగ్ రూట్ లో పయనించి జీల్గుల క్రాస్ కు చేరుకుంటున్నారు.
వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఇబ్బందులు
వరంగల్ వైపు నుంచి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారం గ్రామానికి వెళ్లేందుకు అండర్ పాస్ లేదు. దీంతో వల్భాపూర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. సూరారం రైతులకు ఎల్కతుర్తి, గోపాలపూర్ వరకు వ్యవసాయ భూములున్నాయి. గతంలో సూరారం క్రాస్ వద్ద రోడ్డు దాటితే సరిపోయేది. కానీ ఇప్పుడు ఎల్కతుర్తి వరకు హైవేపై వచ్చి, యూటర్న్ తీసుకుని తిరిగి సూరారం క్రాస్ వద్ద నుంచి పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక బర్లు, ఎడ్లు, కుక్కలు రోడ్డును దాటుతూ మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూరారం వైపు నుంచి హుజురాబాద్ వైపు వాహనాలు అంతదూరం వెళ్లలేక వల్బాపూర్ వరకు హైవేపై రాంగ్ రూట్ లో వెళ్తుండడం గమనార్హం.
పొలం కాడికి పోవడానికి ఇబ్బంది అయితుంది
మా గ్రామానికి చెందిన రైతుల పొలాలు ఎక్కువగా రోడ్డు అవతలి వైపున్న గోపాలపూర్ లోనే ఉన్నాయి. ఇదివరకు రోడ్డు దాటి వెళ్లిపోయేవాళ్లం. కానీ కొత్త రోడ్డు వేసినంక రెయిలింగ్ పెట్టిన్రు. మా పొలం కాడికి పోవాలంటే ఇబ్బంది అయితుంది. బర్లు, గొర్లను తోల్కపోవాలన్నా అవస్థ పడాల్సి వస్తుంది.– కొండం మహేందర్, సూరారం
