- గతంలో రాజయ్య, ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ చర్యలు
- ప్రస్తుతం కొండా సురేఖను తొలగించిన కాంగ్రెస్ సర్కారు
వరంగల్, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ముగ్గురు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే కావడం చర్చనీయాంశమైంది. 2014లో తెలంగాణ ఆవిర్భావం జరగ్గా ఇప్పటి వరకు మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మొదటి రెండు టర్ములు కేసీఆర్ సీఎంగా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్‍రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఈ మూడు టర్మ్‌లలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులపై వేటు పడింది.
బీఆర్‌ఎస్ హయాంలో
తెలంగాణ ఏర్పడి తొలి కెబినెట్ ఏర్పాటు చేసి కేసీఆర్ తన టీమ్‌లో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంగా నియమించారు. డాక్టర్ అయిన రాజయ్యకు హెల్త్ పోర్ట్‌ఫోలియో కేటాయించారు. కానీ కొన్ని నెలలకే ఉన్నట్టుండి రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ స్థానాన్ని అప్పటి ఎంపీ కడియం శ్రీహరితో భర్తీ చేశారు. 2018లో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన ఈటల రాజేందర్‌కు కేబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించారు. ఆ తర్వాత కొంతకాలానికే ఈటల రాజేందర్‍ను కేబినెట్ నుంచి కేసీఆర్బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల విజయం సాధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక
మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. అయితే, ఏడాది కాలంగా సురేఖకు, పార్టీ పెద్దలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇటీవల కొండా సురేఖ బర్త్‌డే సందర్భంగా ఆమె కూతురు సుస్మిత సీఎం రేవంత్‍రెడ్డిపైనా, ప్రభుత్వంపైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్ సురేఖను తప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం కేబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
