కాక్రోచ్ పార్టీలో చీలిక..‘సీపీజే- డెమోక్రటిక్’ కొత్త పార్టీని ప్రకటించిన తిరుగుబాటు నేతలు

కాక్రోచ్ పార్టీలో చీలిక..‘సీపీజే- డెమోక్రటిక్’ కొత్త పార్టీని ప్రకటించిన తిరుగుబాటు నేతలు

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తిరుగుబాటు నేత మనీశ్ బ్రహ్మభట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ- డెమోక్రటిక్’ (సీజేపీ-డీ) ఏర్పాటును ప్రకటించారు. అభిజిత్ దీప్కే నేతృత్వంలోని అసలు పార్టీ.. విద్యార్థి ఉద్యమ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీజేపీ జాతీ య వర్కింగ్ కమిటీ వలంటీర్లను గాలికొదిలేసిందని, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఎజెండా కోసం పనిచేసే 'నామినేటెడ్ టీమ్‌‌'గా మారిందని బ్రహ్మభట్ మండిపడ్డారు. 

వివిధ పార్టీల వలంటీర్లు ఉద్యమంలో పాల్గొన్నా, కమిటీలో మాత్రం కేవలం ఆప్ వర్గానికి చెందిన 8 మందికే పెద్దపీట వేశారని విమర్శించారు.  జంతర్‌‌మంతర్ ఆందోళనలో పాల్గొన్న 450 మంది కోఆర్డినేటర్లకు కొత్త కమిటీలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో ఛత్రపతి శంభాజీనగర్‌‌లో నిరసనలు తెలిపిన వీరు.. తాజాగా ప్రజాస్వామ్య పద్ధతిలో వలంటీర్లను భాగస్వామ్యం చేస్తూ 'సీజేపీ-డీ' జాతీయ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.