ఆ భూమి హనుమంతుడిదే.. వరంగల్‌‌‌‌ జిల్లా కొండపాక హనుమాన్‌ టెంపుల్ భూమివివాదంలో హైకోర్టు తీర్పు

ఆ భూమి హనుమంతుడిదే.. వరంగల్‌‌‌‌ జిల్లా  కొండపాక హనుమాన్‌ టెంపుల్ భూమివివాదంలో హైకోర్టు తీర్పు
  • వరంగల్‌‌‌‌ జిల్లా  కొండపాక హనుమాన్‌‌‌‌ ఆలయానికే 3.11 ఎకరాలు
  • 2007 నుంచే పహాణీల్లో ఆలయం పేరు
  • అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు పిటిషన్‌‌‌‌ వేయడంపై హైకోర్టు అభ్యంతరం
  • కలెక్టర్‌‌‌‌ ఉత్తర్వులను సమర్థించిన కోర్టు

హైదరాబాద్, వెలుగు: వరంగల్‌‌‌‌ జిల్లా పర్వతగిరి మండలం కొండపాక గ్రామంలోని 3.11 ఎకరాల భూమి హనుమాన్‌‌‌‌ ఆలయానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. సర్వే నంబర్‌‌‌‌ 172 ఏ, బీ, సీలోని ఈ భూమిపై కలెక్టర్‌‌‌‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భూమిపై హక్కు కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను కొట్టివేసింది. 2007 నుంచే పహాణీల్లో సదరు భూమి హనుమాన్‌‌‌‌ ఆలయం పేరుతో నమోదై ఉందని కోర్టు గుర్తించింది. 

ఇన్నేళ్లుగా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. ఇప్పుడు వినతిపత్రాలు, పిటిషన్లు వేయడాన్ని తప్పుబట్టింది. ఆలయం దేవాదాయ చట్టం కింద నమోదై ఉందని, ఆలయానికి సంబంధించిన ఆస్తులు కూడా అధికారిక రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంది. కొండపాక గ్రామానికి చెందిన చంద్రకంటి రవీందర్‌‌‌‌రావుతో పాటు మరో ఇద్దరు.. కలెక్టర్‌‌‌‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌‌‌‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వీకుల నుంచి ఇనాం దారుగా భూమి తమకు సంక్రమించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. 

2012-–13 మధ్య వీఆర్‌‌‌‌వో రికార్డులను మార్చి భూమిని ప్రభుత్వ భూమిగా చూపించారని ఆరోపించారు. 2009–-10లో ఏర్పాటైన హనుమాన్‌‌‌‌ ఆలయానికి ఇనాం భూములపై హక్కులు కల్పించడం సరికాదని వాదించారు. 2019లో రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా తిరస్కరించడంతో ఆర్డీవోను ఆశ్రయించామని, చివరకు విషయం కలెక్టర్‌‌‌‌ వద్దకు చేరిందని తెలిపారు. రికార్డులను పూర్తిగా పరిశీలించకుండానే కలెక్టర్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ను కొట్టివేశారని కోర్టుకు వివరించారు.

ఆధారాలు లేవన్న కోర్టు..

ప్రభుత్వం తరఫున న్యాయవాది భూక్యా మంగీలాల్‌‌‌‌ నాయక్‌‌‌‌ వాదనలు వినిపించారు. హనుమాన్‌‌‌‌ ఆలయం దేవాదాయ చట్టం కింద నమోదై ఉందని, ఆలయ నిర్వహణ కోసం 3.11 ఎకరాల ఇనాం భూమి కేటాయించారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌‌‌‌ ఇ.వి. వేణుగోపాల్‌‌‌‌.. 2007 నుంచే పహాణీల్లో ఆలయం పేరు ఉన్నా పిటిషనర్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఆలయానికి దేవాదాయ చట్టం కింద గుర్తింపు ఉండటంతో పాటు దాని ఆస్తులు కూడా రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు. సరైన ఆధారాలు చూపకుండా దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కొట్టివేశారు.