- కొలత్తూర్ ఎన్నికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత
చెన్నై: డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించాలని, తమిళగ వెట్రి కజగం(టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని కోరుతూ స్టాలిన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అనర్హమని మద్రాస్ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్ 74,202 ఓట్లు సాధించారు. అయితే, ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలనలో తీవ్రమైన లోపాలున్నాయని ఆరోపిస్తూ స్టాలిన్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(b), ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 80 ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాల్ చేయడానికి రిట్ పిటిషన్ చెల్లదని వాదించారు.
