ఇండియా గ్రోత్ ప్రపంచానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది : ప్రధాని మోదీ

ఇండియా గ్రోత్ ప్రపంచానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది : ప్రధాని మోదీ
  • ఉక్రెయిన్‌‌, పశ్చిమాసియాలో శాంతికి దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ
  • బెల్జియంతో వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలపై చర్చలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి 7.8 శాతంగా నమోదైందని చెప్పారు. ఇండియా సాధించిన ఈ వృద్ధి ప్రపంచానికి కాన్ఫిడెన్స్, కొత్త అవకాశాలను ఇస్తోందని పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్‌‌ డి వెవర్‌‌తో గురువారం మోదీ సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. రక్షణ రంగంలో సైనిక శిక్షణ, సమాచార మార్పిడిని పెంచడంతోపాటు ఆయుధాల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని అంగీకరించాయి.

భారత్‌‌–బెల్జియం వాణిజ్యం 13.01 బిలియన్‌‌ డాలర్లు

ఉక్రెయిన్‌‌, పశ్చిమాసియా ఘర్షణలకు చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం చూపాలని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించేందుకు భారత్‌‌, బెల్జియం కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెన్యూవబుల్​ఎనర్జీపై కుదిరిన ఒప్పందంతో సహకారం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్, ప్రాసెసింగ్‌‌, రీసైక్లింగ్‌‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సెమీకండక్టర్ల రంగంలో బెల్జియం స్కిల్స్‌‌, భారత్‌‌ కెపాసిటీ పరస్పరం ఉపయోగపడతాయని మోదీ చెప్పారు.

స్టార్టప్‌‌లు, సముద్ర రంగం, యూనివర్సిటీలు, పరిశోధనలోనూ సహకారం పెంచనున్నారు. త్వరలో వలస, మొబిలిటీ ఒప్పందం చేసుకోనున్నారు. 2025–26లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 13.01 బిలియన్‌‌ డాలర్లకు చేరింది. 2000 ఏప్రిల్‌‌ నుంచి 2025 డిసెంబర్‌‌ వరకు భారత్‌‌లోకి బెల్జియం నుంచి సుమారు 4.2 బిలియన్‌‌ డాలర్ల ఎఫ్‌‌డీఐ వచ్చింది. కాకినాడలో బెల్జియం సంస్థ జాన్‌‌ కాకెరిల్‌‌ 2 గిగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్‌‌ ప్లాంట్‌‌ నిర్మిస్తోంది.