స్పెషల్ మొబైల్ యాప్లో వివరాల నమోదు
తనిఖీ చేసిన హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఎంపికైనవారి వివరాలను క్షేత్ర స్థాయిలో అధికారులు వెరిఫికేషన్ చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ (మొబైల్ అప్లికేషన్) రూపొందించారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్ర స్థాయిలో 80 మంది హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పోరేషన్, రాజీవ్ స్వగృహ అధికారుల బృందం పరిశీలిస్తున్నది. హౌసింగ్ బోర్డు తోపాటు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాల్లోని హౌసింగ్ కార్పొరేషన్ కు చెందిన ఈఈలు, ప్రాజెక్ట్ డైరక్టర్లు, అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్లు, ఏఈలు, జూనియర్ అసిస్టెంట్లతో పాటు వివిధ స్థాయిల్లో ఉన్న సిబ్బంది ఈ సర్వేను నిర్వహిస్తున్నారు.
ఏఏ అంశాలను పరిశీలిస్తున్నారంటే..!
గురువారం హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను బషీర్ బాగ్ లో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ.. యాప్ లో అధికారులు నమోదు చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వివరాలను స్వయంగా అప్ లోడ్ కూడా చేశారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎటువంటి ధ్రువపత్రాలను స్వీకరించలేదు. కేవలం వివరాలను మాత్రమే తీసుకున్నారు. ఇవ్వుడు ఆ వివరాల్లోని వాస్తవికతను నిర్ధారించుకోడానికి అధిగకారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. వీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా?ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్థితి గతులు (ఆర్సీసీ, రేకుల షెడ్ వంటివి)? ఇంటిలో ఉంటున్న వారు ఏం పని చేస్తున్నారు? అనే వివరాలతో పాటు ఎంతకాలంగా ఆ ఇంటిలో నివసిస్తున్నారు? మొదలైన అంశాలను అడుగుతున్నారు.
వాటిని యాప్ ద్వారా అక్కడికక్కడే అప్ లోడ్ చేస్తున్నారు. పదేళ్లుగా నివసిస్తున్నారా? లేదా? ఒకవేళ 10 ఏళ్లు పూర్తి కాకపోతే అంతకు ముందు ఎక్కడ నివసించారు? తదితర అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా అంశాలపై ధ్రువపత్రాలతోపాటు వారు ప్రస్తుతముంటున్న ఇండ్ల ఫొటోలను కూడా యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు.ఈ సర్వే ప్రక్రియకు దరఖాస్తుదారులు సహకరించాలని హౌసింగ్ బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో (సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహా) నిర్మిస్తున్న 480 ఇండ్లతో పాటు వెయిటింగ్ లిస్ట్ గా అదనంగా 120 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు.
