పనిచేయని అధికారులపై కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

పనిచేయని అధికారులపై కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: అధికారులు చేసే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తలదించుకోవాల్సి వస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి వాపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ, రీ సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై భద్రాద్రి కొత్తగూడెం ఐడీవోసీ ఆఫీస్‌‌‌‌లో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో గురువారం రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ప్రతి భూ యజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని  రీ సర్వే పురోగతి, నాన్-కెడస్ట్రల్ , కెడస్ట్రల్ గ్రామాల్లో సర్వే పనులు, లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ సర్వేయర్ల పనితీరు, 22-ఏ భూముల వివరాలు, సాదాబైనామాలు, భూ భారతి చట్టం, రిజిస్ట్రేషన్ శాఖకు కొత్త బిల్డింగ్​ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, ఉచిత ఇసుక సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ రివ్యూలో తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య, డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్లు దివాకర్, అంకిత్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఇతర అధికారులు 
పాల్గొన్నారు.