అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ భోజనంలో గన్నేరు ఆకులు.. ఐదుగురికి అస్వస్థత.. ఖమ్మం జిల్లా కిష్టారం‌‌–3 కేంద్రంలో ఘటన

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ భోజనంలో గన్నేరు ఆకులు..     ఐదుగురికి అస్వస్థత.. ఖమ్మం  జిల్లా కిష్టారం‌‌–3 కేంద్రంలో ఘటన

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని కిష్టారం–3 అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనంలో గన్నేరు ఆకులు కనిపించడం కలకలం రేపింది. భోజనం చేసిన ఇద్దరు తల్లులు, ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 1న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ నెల 1న పట్రా స్వప్న తన కొడుకు యశ్వంత్‌‌‌‌‌‌‌‌(3), పట్రా రమ్య తన కొడుకు రియాన్స్‌‌‌‌‌‌‌‌(2), తోట కుమారి తన కుమార్తె తన్మయి(3)తో కలిసి అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో ఆకుకూరతో పాటు గన్నేరు ఆకులు కనిపించాయి. 

అనంతరం ఐదుగురూ అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వారిని ఖమ్మంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించి వైద్యుల సూచన మేరకు డిశ్చార్జి చేసినట్లు సూపర్​వైజర్​ రజిని తెలిపారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. విషపూరితమైన గన్నేరు ఆకులు భోజనంలోకి ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.