పట్టణాల్లో ఉంటూ ఏజెన్సీ అలవెన్సులు!..డ్యూటీ చేస్తున్న గ్రామాల్లోనే ఉంటున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు

పట్టణాల్లో ఉంటూ  ఏజెన్సీ అలవెన్సులు!..డ్యూటీ చేస్తున్న గ్రామాల్లోనే ఉంటున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు
  • పంచాయతీ సెక్రటరీల నుంచి టీచర్లు, ఆఫీసర్ల వరకు అందరూ జిల్లా కేంద్రాల్లోనే నివాసం
  •     అడిషనల్​ హెచ్ఆర్ఏ, స్పెషల్  కాంపన్సేటరీ అలవెన్స్  కోసం ప్రభుత్వానికి నకిలీ బిల్లులు
  •     ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.3 వేల వరకు అదనపు చెల్లింపులు 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో 41 గ్రామపంచాయతీలకు గాను రెండు గ్రామపంచాయతీలు మినహా మిగిలిన 39 జీపీలను షెడ్యూల్డ్  గ్రామాలుగా గుర్తించారు. ఈ ఏజెన్సీ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 275 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు ఏజెన్సీ గ్రామాల్లో నివాసం ఉండేందుకు అడిషనల్  హౌస్  రెంట్  అలవెన్స్, ఎస్ సీఏ(స్పెషల్  కాంపెన్సేటరీ అలవెన్స్) రెండు కలిపి రూ.2,950 పొందుతున్నారు. ఒకరిద్దరు మినహా ఏ ఒక్కరు కూడా ఏజెన్సీ గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. అలాగే 37 మంది జీపీ సెక్రటరీలు కూడా ఏజెన్సీలో పని చేస్తూ అలవెన్సులు తీసుకుంటున్నారు. ఇల్లందు, ఖమ్మం నగరాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. హెల్త్ డిపార్ట్​మెంట్ కు సంబంధించి 8 మంది ఉద్యోగులు మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పని చేస్తూ అలవెన్సులు తీసుకుంటున్నారు. వీరు ఏజెన్సీ గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. 

ఖమ్మం/ కామేపల్లి, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. డ్యూటీ కేటాయించిన గ్రామంలో, ప్రాంతంలో కాకుండా పట్టణంలో నివాసం ఉంటూ ఏజెన్సీ అలవెన్సును మాత్రం అకౌంట్లలో వేసుకుంటున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, ఫేక్​ బిల్లులతో అడిషనల్​ హౌజ్​ రెంట్ అలవెన్స్(అడిషనల్ హెచ్ఆర్ఏ), స్పెషల్  కాంపన్సేటరీ అలవెన్స్(సీఎస్ఏ)​ పొందుతున్నారు. ఆయా గ్రామాల్లో పని చేసే పంచాయతీ సెక్రటరీల నుంచి టీచర్లు, మండల ఆఫీసర్లు, ఆయా మండల ఆఫీసుల్లోని సిబ్బందితో సహా అందరూ ఇదే తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో ఒకరిద్దరు మాత్రమే నివాసం ఉంటున్నారనే విమర్శలున్నాయి.

అదనపు భత్యం ఇలా..

ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి బేసిక్  శాలరీకి అదనంగా హౌజ్​​ రెంట్  అలవెన్స్(హెచ్ఆర్ఏ)ని ఇస్తుంది. నగరాల్లో 17 శాతం, పట్టణాల్లో 13 శాతం, ఇతర ప్రాంతాల్లో ఇది 11 శాతంగా ఉంది. ఇక దీనికి అదనంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు బేసిక్​ శాలరీలో 8 శాతం అడిషనల్ హెచ్ఆర్ఏ కలిపి ఇస్తారు. దీన్ని గరిష్టంగా రూ.2 వేల వరకు ఇస్తారు. ఇది కాకుండా స్పెషల్  కాంపన్సేటరీ అలవెన్స్(ఎస్​సీఏ)ను కూడా ఇస్తారు. షెడ్యూల్డ్  ఏరియాలోని కష్టతరమైన పరిస్థితులను బట్టి ఈ అలవెన్స్​ను మూడు రకాలుగా విభజించారు. 

హిల్స్/హిల్ టాప్స్, నాన్​ మండల్ హెడ్ క్వార్టర్స్, మండల్  హెడ్ క్వార్టర్స్ గా వర్గీకరించారు. వీటిలో రూ.975 నుంచి రూ.1,275 వరకు అదనంగా భత్యం పొందవచ్చు. పని చేస్తున్న ఏజెన్సీ ప్రాంతంలోనే నివాసం ఉండేందుకు ప్రభుత్వం వీటిని వేతనానికి అదనంగా ఇస్తుండగా, ఉద్యోగులు మాత్రం జిల్లా కేంద్రంలో ఉంటూ ఫేక్​ బిల్లులతో భత్యాలు పొందుతున్నారు. మహిళా సిబ్బంది, టీచర్లు, ఉద్యోగులు ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటూ ప్రతి రోజూ ఉచితంగా ప్రయాణాలు చేస్తుండగా, ఇతర ఉద్యోగులు కూడా అవకాశాన్ని బట్టి కార్లు, బస్సుల్లో అప్​ అండ్​ డౌన్​ చేస్తున్నారు. వీరంతా ఆయా గ్రామపంచాయతీల్లో ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నట్లు ఎవరిదో ఒకరి ఇంటి నంబర్​ వేసి, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఫేక్​ సర్టిఫికెట్లు పొందుతున్నారు. 

ఫేక్​ సర్టిఫికెట్లతోనే.. 

ఏజెన్సీ ఏరియాలో ప్రతి మండలంలో 100 మందికి పైగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, టీచర్లు పని చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ కనీసం రూ.3 వేల వరకు ఇలా ఫేక్  సర్టిఫికెట్లతో భత్యాలు పొందుతున్నారు. ఖమ్మం నగరంలోని ప్రింటింగ్  షాపులు, కొన్ని బుక్​ స్టాళ్లలో కూడా ఈ అలవెన్స్​లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్లు అమ్ముతుంటారు. ఇలా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పని చేస్తున్న చోట నివాసం ఉండని వారిపై యాక్షన్​ తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.