న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో శతాబ్దాల నాటి హిందూ ఆలయం ధ్వంసం కావడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. మైనారిటీల ప్రార్థనా స్థలాలను రక్షించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ మండిపడింది. ఘటనపై పూర్తిస్థాయి, పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో ఉన్న చారిత్రక ఆలయం ఆగస్టు 21న ధ్వంసమైంది.
మదర్సా నిర్మాణం కోసం ఆలయాన్ని కావాలనే కూల్చివేశారని స్థానికులు, మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగానే పాత కట్టడం కూలిపోయిందని పాక్ అధికారులు చెబుతున్నారు.
ఈ వివాదంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. మైనారిటీల ప్రార్థనా స్థలంపై జరిగిన ఘటనను ఖండించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చారిత్రక కట్టడం నేలమట్టమైందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. మరోవైపు, ఆలయ కూల్చివేత వెనుక మత ఛాందసవాదుల హస్తం ఉందని పాక్‌లోని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
