కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-1 అండర్ గ్రౌండ్ బొగ్గు గనిని ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గని ఆవరణపై గోల్డెన్‌జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు,ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. కేక్‌కట్ చేసిన అనంతరం 50 ఏళ్ల ప్రస్థానంలో ఎస్సార్పీ-1 కోల్‌మైన్ సాధించిన విజయాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్ అవసరాలకు కావాల్సిన బొగ్గును యాభై ఏళ్లుగా సరఫరా చేస్తూ జాతికి వెలుగులు అందించడంలో ఎస్సార్పీ-1 ఆదర్శంగా నిలిచిందన్నారు.
కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల సమష్టి కృషితో ఎస్సార్పీ-1 కోల్‌మైన్ క్వాలిటీ బొగ్గును ఉత్పత్తి చేస్తూ రక్షణ, భద్రతా అంశాల్లో జాతీయ రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందన్నారు. గనిలో కొత్త పనిప్రదేశాలను గుర్తించడంలో ఏరియా జీఎం శ్రీనివాస్, ఏజెంట్రవికుమార్, గని మేనేజర్ ఆత్మారాం సహాని చురుగ్గా వ్యవహరించారన్నారు. నూతన ఉపాధులు, బొగ్గు ఉత్పత్తి పెంపునకు సింగరేణి కంపెనీలో కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉందని, చెన్నూరు సౌత్, నార్త్, శ్రావణపల్లి, చింతగూడ బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ వేడుకలకు కార్మికులు, రిటైర్డు కార్మికులు, ఆఫీసర్లు వేలాదిగా హాజరయ్యారు. వేడుకల్లో శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, క్వాలిటీ జీఎంలు వీరభద్రరావు, వెంకటరమణ, మాజీ జీఎం సుగుణకర్రెడ్డి, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
