గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని పురాతన కోటలో గుప్తనిధులు ఉన్నాయంటూ తవ్వకాల వీడియోలు చూపి ప్రజలను మోసగించేందుకు యత్నించిన నలుగురిని ఉట్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉట్నూర్ ఎస్‌హెచ్‌వో విజయ్ వివరాల ప్రకారం.. సోమవారం కొత్తగూడ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా జన్నారం వైపు నుంచి వచ్చిన కారులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఫోన్లు పరిశీలించగా నిధుల కోసం భూమి తవ్వుతున్న వీడియోలు లభించాయి. ఉట్నూర్ కోటలో గుప్త నిధుల పేరిట పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేయడంతో పాటు, నకిలీ ఆయుర్వేద మందుల విక్రయానికి యత్నించినట్లు విచారణలో తేలింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన కెమెర కిషన్ , దుర్గం లింగయ్య, దుర్గం ప్రవీణ్, సిద్దిపేటకు చెందిన దాసరి యేసుబాబును అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
