AIతో పిల్లల ఆలోచన శక్తి తగ్గిపోతుంది.. అమెరికా స్కూళ్లలో ఏఐ బ్యాన్

AIతో పిల్లల ఆలోచన శక్తి తగ్గిపోతుంది.. అమెరికా స్కూళ్లలో ఏఐ బ్యాన్

ఆర్టిఫిషియల్ ఇంటెలిపజెన్స్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని రంగాల్లో మార్పు వచ్చేసింది. ఏం కావాలన్నా ఏఐని అడిగే పరిస్థితి. చివరికి ఫ్యామిలీ సమస్యలు, ఆరోగ్య సమస్యలను కూడా ఏఐ సలహా తీసుకునే వరకు వచ్చేసింది ఇవాళ్టి ట్రెండ్. అయితే ఏఐ విద్యారంగంలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులు ఏఐ ని విపరీతంగా వినియోగించడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. దీంతో స్కూళ్లలో ఏఐ వినియోగాన్ని బ్యాన్ చేస్తున్నట్లు న్యూయార్క్ ప్రకటించింది. 

న్యూయార్క్ లోని ఎలిమెంటరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్ లో  విద్యార్థుల ఏఐ వినియోగాన్ని తాత్కాలికంగా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మేయర్. ఏఐ వినియోగం, పిల్లలపై దాని ప్రభావాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లు మేయర్ మమ్దానీ పేర్కొన్నారు. 

అదే సమయంలో, సిటీలోని అన్ని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థుల కోసం సంవత్సరానికి రెండుసార్లు AI లిటరసీ తరగతులను ఏర్పాటు చేస్తోంది. ఒక టీచర్ పర్యవేక్షణలో కొంతమంది విద్యార్థులు కొన్ని AI ప్లాట్‌ఫారమ్‌లను పరిచయం చేయడానికి పైలట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. 

దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు.. క్లాస్ రూమ్ లలో   AI టూల్స్ వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పిల్లలకు ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తూనే, వారు దానిపై అతిగా ఆధారపడకుండా లేదా మోసానికి ఉపయోగించకుండా ఉంచేందుకు ప్రయత్నించనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. 

అదే సమయంలో స్టూడెంట్స్ కు స్క్రీన్ టైమ్ లిమిట్ ను పెట్టనున్నారు.  3 నుండి 5 తరగతుల విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు 45 నిమిషాల గరిష్ట పరిమితిని సూచిస్తుంది. మరోవైపు టీచింగ్, షెడ్యూల్ కు సంబంధించి ఉపాధ్యాయులు ఏఐ (AI)ని వాడకానికి అవకాశం కల్పించారు.