హైదరాబాద్‌లోని మియాపూర్ న్యూ హఫీజ్‌పేట్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి, ప్రభుత్వ స్థలాలు , నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా అడ్డుకున్నారు. తమ జీవితకాలపు కష్టమంతాధారపడి ఉన్న ఇళ్లను కూల్చవద్దంటూ మున్సిపల్ అధికారులను బాధితులు కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
