త్వరలోనే నామినేటెడ్‌‌ పోస్టుల భర్తీ.. గడువు ముగిసిన కార్పొరేషన్‌‌ పదవుల రెన్యూవల్‌‌పైనా చర్చ

త్వరలోనే నామినేటెడ్‌‌ పోస్టుల భర్తీ.. గడువు ముగిసిన కార్పొరేషన్‌‌ పదవుల రెన్యూవల్‌‌పైనా చర్చ
  •     సీఎంతో పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌ భేటీ
  •     గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ రెండు సీట్లూ గెలవాల్సిందేనని సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నామినేటెడ్‌‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అంశంపై సీఎం రేవంత్‌‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌‌కుమార్‌‌ గౌడ్‌‌ చర్చించారు. సోమవారం సీఎం రేవంత్‌‌రెడ్డితో మహేశ్‌‌కుమార్‌‌ గౌడ్‌‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు పదవుల్లో అవకాశం కల్పించేలా నామినేటెడ్‌‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పెండింగ్‌‌లో ఉన్న కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ పదవులతోపాటు గడువు ముగిసిన పదవులను రెన్యూవల్‌‌ చేయాలా? కొత్తవారికి అవకాశం ఇవ్వాలా? అనే అంశాలపైనా సమాలోచనలు జరిపారు. త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కూడా చర్చించారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలనూ కాంగ్రెస్‌‌ గెలుచుకోవాలని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యులు అనిల్‌‌కుమార్‌‌ యాదవ్‌‌, నవీన్‌‌ యాదవ్‌‌, కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నేత రోహిన్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.