విల్లుపురాన్ని విరూపాక్షుడు పాలించేవాడు. విల్లుపురంలో వీవా నది పారుతుండడంతో ఆ రాజ్యం పచ్చని పొలాలతో... ధన, ధాన్య రాశులతో విలసిల్లేది. విల్లుపురం పక్కనే ఉన్న విదర్భరాజు విక్రమసేనుడు కష్టజీవి. తన రాజ్యంలో ఎలాంటి వనరులు లేకపోయినా పరిశ్రమలు పెట్టి ప్రజలకి ఉపాధి కల్పించి, అభివృద్ధి సాధించాలని ఆలోచించేవాడు. అయితే ఆ రాజ్యంలో తగిన నీటి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు."ఏంచేయాలా" అని ఆలోచించాడు విక్రమసేనుడు.
పక్కనే ఉన్న విల్లుపురంలో నీటివనరులు ఎక్కువగా ఉండి... పంటలు బాగా పండాయి. అక్కడ ధాన్యరాశులు మిగిలిపోయాయని తెలుసుకున్నాడు. విక్రమసేనుడు. వెంటనే ఆలస్యం చేయకుండా విరూపాక్షుడి దగ్గరకెళ్లి తనకు నీటి సౌకర్యం కల్పిస్తే ఆహారపదార్థాల పరిశ్రమ పెట్టి, వాటిని తయారుచేసి ఇతర రాజ్యాలకు అమ్మి లాభాలు ఆర్జించొచ్చు అంటాడు. అందులో ఆ దేశానికి కూడా కొంత వాటా ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఆలోచన నచ్చుతుంది విరూపాక్షుడుకి. దాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తాడు. వీవా నదిపై పెద్ద ఆనకట్ట కట్టి నీటిని తమ దేశానికి మళ్ళిస్తాడు విక్రమసేనుడు. నీటివనరుల్ని ఉపయోగించి పంటల్ని పండిస్తాడు.
ఆ రెండుదేశాలకు పొరుగున ఉన్న ఉజ్జయిని రాజు ఉదయభానుడు... తాను కూడా పెట్టుబడులు పెడతానని, పరిశ్రమలకు అనుమతివ్వాలని కోరతాడు. విరూపాక్షుడు, విక్రమసేనుడు అనుమతులిస్తారు. కొద్ది రోజుల్లోనే రెండు దేశాల్లో పరిశ్రమలు వచ్చి, వేల మందికి ఉపాధి లభిస్తుంది. పన్నుల రూపంలో అంచనాలకు మించి ఆదాయం వస్తుంది. ఉజ్జయిని రాజ్యానికి కూడా లాభం చేకూరుతుంది. మూడు రాజ్యాలు అభివృద్ధి పథంలో దూసుకుపోయాయి. ఈ విషయం పక్కనే ఉన్న పాంచాలీ నగరాధిపతి ప్రవరాఖ్యుడు చెవిన పడుతుంది. మూడు దేశాల రాజ్యాధిపతులతో చర్చించి తన దేశంలో పేదరికం పోగొట్టడానికి మార్గం చెప్పమంటాడు.
ఆహార ధాన్యాలు పండించి ఆకలి తీరిస్తే పేదరికం పోతుందని సలహా ఇస్తారు వాళ్లు. ఇంతవరకు ఏ ఆలోచనా లేకుండా నిస్సహాయతతో బతుకుతున్న పాంచాలీ నగర ప్రజలకు వీవా నది నుంచి నీళ్లు అందడంతో కష్టపడి పనిచేసి ఆహారధాన్యాలు పండించి వాటిని మూడు దేశాలకూ విక్రయించారు. దాంతో బాగా ధనం సమకూరింది. నిరాశానిస్పృహలతో ఉన్న పాంచాలీ నగరాధిపతి ప్రవరాఖ్యుడు కూడా పొలంకొని పంటలు పండించి ప్రగతి సాధించాడు. రాజుగా పొందలేని ఆనందం రైతుగా పొందాడు. అందుకే "రైతే రాజు. ఏ దేశానికైనా తిండిపెట్టే రైతు లేడంటే రాజ్యం లేదు. దేశ ప్రగతికి రైతే వెన్నెముక" అని ప్రజలందరికీ వివరిస్తాడు ప్రవరాఖ్యుడు.
-బోగా పురుషోత్తం
