నేనంటే లెక్క లేదా: పాకిస్థాన్ సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ రాజీనామా

నేనంటే లెక్క లేదా: పాకిస్థాన్ సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ రాజీనామా

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ సెలక్షన్ కమిటీ పదవికి మిస్బా-ఉల్-హక్  రాజీనామా చేశారు. అలాగే, లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌ పదవికి సైతం గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పీసీబీ ఇంకా మిస్బా రాజీనామాను ఆమోదించలేదు. కేవలం 6 నెలల వ్యవధిలోనే మిస్బా పదవి నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‎లో 194 పరుగుల తేడాతో అతిథ్య జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ 2-0తో వెనుకబడింది. లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత జట్టు, కోచింగ్ స్టా్ఫ్‎లో పీసీబీ ప్రక్షాళన చేపట్టింది. మూడో టెస్టుకు ముందు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్లతో సహా మొత్తం ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించేసింది.

అలాగే, రెడ్ బాల్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా బాధ్యతల నుంచి తక్షణమే తప్పించింది. అయితే, సెలెక్షన్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న తనను ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందే పీసీబీ తనను కనీసం సంప్రదించలేదని మిస్బా అలకబూనారు. ఈ నేపథ్యంలోనే జాతీయ సెలక్షన్ కమిటీ పదవితో పాటు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌ పదవికి రాజీనామా చేశారు.

►ALSO READ | నన్నే లైట్ తీసుకుంటారా.. ఇది నా స్టామినా! దులీప్ ట్రోఫీలో దుమ్ము రేపుతున్న షమీ

మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పాకిస్తాన్ క్రికెట్‌లో అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. 2019లో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి.. అక్టోబర్ 2020లో చీఫ్ సెలెక్టర్ పదవిని వదులుకున్నారు. 2021లో ఆయన హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2023లో జకా అష్రఫ్ తాత్కాలిక నిర్వహణ కమిటీలో సలహాదారుడిగా పీసీబీలో రీ ఎంట్రీ ఇచ్చారు. 

2024లో పురుషుల ఛాంపియన్స్ కప్‌కు ఐదుగురు మార్గదర్శిగా పని చేయడంతో పాటు మహిళల దేశీయ జట్లతో కలిసి పనిచేశారు. 2026, జూలైలో షహీన్ అఫ్రిది నాయకత్వంలోని పాకిస్తాన్ గోల్డ్ జట్టును ముల్తాన్‌లో జరిగిన 50-ఓవర్ల నేషనల్ ఛాంపియన్స్ కప్‌లో విజయపథంలో నడిపించారు.