అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సమావేశంలో చేసిన హాకిష్ వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగా గోల్డ్, వెండి ధరల్లో ఊహించని ఒడుదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలతో బాండ్ ఈల్డ్స్ పెరిగి.. బంగారం, వెండి ధరలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల వంటి పరిణామాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా లేదా అనేదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అంచనాలు వెల్లడించారు. జూలియస్ బేర్ రీసెర్చ్ హెడ్ కార్టెన్ మెంక్ ప్రకారం.. వెండితో పోలిస్తే బంగారానికే బలమైన సపోర్ట్ కలిగి ఉంది. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఇదే క్రమంలో ఇండస్ట్రియల్ డిమాండ్ మందగించడం, చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి తగ్గటం వంటి అంశాలు వెండిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ప్రముఖ సంస్థ మోనార్క్ పీఎంఎస్ 2026 చివరి నాటికి బంగారం, వెండి ధరలపై మూడు భిన్నమైన అంచనాలను విడుదల చేసింది. ఇందులో భాగంగానే చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత సానుకూలమైన ‘బుల్ కేస్’ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. లక్షా52వేల 554 నుంచి రూ.లక్షా 70వేల 861 మధ్యకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ALSO READ : ఎక్కువ లోన్స్ ఉన్నాయా..?
అయితే ఈ గరిష్ట అంచనా నిజం కావాలంటే కొన్ని ప్రత్యేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి. అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవలసి రావడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి గోల్డ్ వైపు మళ్లడం వంటి బలమైన కారణాలు తోడైతేనే బంగారం ధర రూ.లక్షా 70వేల 861 స్థాయిని తాకే అవకాశం ఉందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతానికి మోనార్క్ పీఎంఎస్ 55% ప్రాబబిలిటీ ఉన్న తమ 'బేస్ కేస్' కింద మాత్రం 10 గ్రాముల బంగారం రూ.లక్షా 31వేల170 నుంచి రూ.లక్షా 43వేల 372 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ సవాళ్లు, ఫెడ్ విధానాల ఆధారంగా రాబోయే కాలంలో బంగారం, వెండి ధరల గమనం పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
