సీజనల్ వ్యాధులతో జాగ్రత్త.. వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త.. వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ
  • దోమలు, కలుషిత నీరు, గాలి ద్వారా రోగాలు వ్యాపించే చాన్స్​
  • లక్షణాలు కనిపిస్తే సర్కారు దవాఖానలకు వెళ్లాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య రక్షణపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ మార్గదర్శకాలు జారీ చేశారు. దోమలు, కలుషిత నీరు, గాలి ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.

దోమలు, కలుషిత నీటితో ముప్పు...

వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్‌‌‌‌‌‌‌‌ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు రాకుండా తలుపులు, కిటికీలకు నెట్లు బిగించుకోవాలని, నిద్రించే సమయంలో దోమతెరలు, రిపెల్లెంట్లు వాడాలని సూచించారు. ఇంటి పరిసరాల్లోని డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, సెప్టిక్ ట్యాంకులపై దోమలు చేరకుండా జల్లెడలు అమర్చాలని పేర్కొన్నారు. నీటి నిల్వలను తొలగించేందుకు ప్రతి వారం తప్పనిసరిగా ఫ్రైడే– డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే గ్యాస్ట్రోఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సోకే వ్యాధుల నివారణకు కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలని, భోజనానికి ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, నిల్వ ఉంచిన బయటి ఆహారాన్ని తినకూడదని స్పష్టం చేశారు.

ఫ్లూ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు

గాలి ద్వారా వ్యాపించే వైరల్ జ్వరాలు, ఇన్‌‌‌‌ ఫ్లుయెంజా వ్యాప్తిని అరికట్టేందుకు అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇతరులతో కరచాలనం చేయకూడదని, తరచూ శానిటైజర్లు వాడాలని అధికారులు సూచించారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలును అడ్డం పెట్టుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని, ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని తెలిపారు.

సర్కారు దవాఖానల్లో ముందస్తు ఏర్పాట్లు..

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌‌‌‌ వాడీ వర్కర్ల వద్ద తగినన్ని మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

భయం వద్దు.. అవగాహన ముఖ్యం

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇళ్ల పరిసరాల్లోని కొబ్బరి బోండాలు, కూలర్లు, పాత టైర్లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా పాటించి ఏడిస్ దోమల లార్వాలను అరికట్టాలి. దోమలు కుట్టకుండా కాళ్లు, చేతులు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి. ఇక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా ముప్పు ఎక్కువగా ఉండే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, ఆస్తమా రోగులు వైద్యుల సలహాతో ముందస్తుగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం బెటర్.

- డాక్టర్ పి. రాజారావు, ప్రిన్సిపాల్, 
ఉస్మానియా మెడికల్ కాలేజీ