- అర్ధరాత్రి రూమ్‌లోకి ప్రవేశించి.. ముఖంపై రాడ్‌తో దాడి
- ఆ తర్వాత లైంగికదాడి చేసి పరారీ
- నిందితుడు బిహార్‌కు చెందిన సదావుల్లాగా గుర్తింపు
- హాస్పిటల్ వద్దే బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తూ దారుణం
- హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఘటన
పహడీషరీఫ్, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రైమ్ కేర్ దవాఖాన షెల్టర్ రూమ్‌లో ఓ నర్సును ఓ కిరాతకుడు అత్యంత పాశవికంగా చంపేశాడు. హాస్పిటల్రూమ్లో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించడంతో రాడ్‌తో ముఖంపై చితకబాదాడు. ఆ తర్వాత లైంగికదాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఓ యువతి(21) ఏడు నెలలుగా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ దవాఖానలో నర్సుగా పని చేస్తోంది. ఆ హాస్పిటల్బిల్డింగ్ కింది రూమ్‌లోనే ఓ బైక్మెకానిక్షాపు ఉంది. దాని పక్క సందు నుంచే నర్సులకు కేటాయించిన రూమ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, శనివారం మధ్యాహ్నం ఆమె డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బంది గదికి వెళ్లి తలుపులు కొట్టారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉంది.
దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పహడీషరీఫ్పోలీసులు డాగ్, క్లూస్ టీమ్‌తో వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పంక్చర్ లివర్‌తో ముఖంపై బలంగా కొట్టి హతమార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాళ్లపై కూడా తీవ్ర గాయాలున్నాయి. బాధితురాలి దుస్తులు, శరీరంపై ఉన్న గాయాలను బట్టి లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించి..
బిహార్‌లోని బేగుసరాయ్ జిల్లా బచ్వారా మండలం రుదౌలి గ్రామానికి చెందిన మహ్మద్ సదావుల్లా(34) తుక్కుగూడ వద్ద ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఆవరణలోని షాపులో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. హాస్టల్పక్కనే షాపు ఉండడంతో కొద్ది రోజులుగా యువతి వచ్చే టైం, వెళ్లే టైం గమనిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆమె తన రూమ్‌లో ఒంటరిగా ఉందని, పక్కన రూముల్లో కూడా ఎవరూ లేరని తెలుసుకున్నాడు. తర్వాత కిటికీ ద్వారా ఆమె రూమ్‌లోకి ప్రవేశించాడు.
అలికిడి విన్న ఆమె కళ్లు తెరిచి చూసే సరికి ఎవరో లోపలకు రావడం కనిపించింది. దీంతో అరవబోయింది. వెంటనే ఆమె నోరు మూసిన నిందితుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్‌తో ఆమె ముఖంపై చితకబాదాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో లైంగికదాడి చేశాడు. తర్వాత గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
వీడియో కాల్మాట్లాడిన గంటల్లోనే..
యువతి తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆమెతో పాటు మరో కొడుకును పోషిస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి 10.30 గంటల వరకు కుటుంబసభ్యులతో అమె వీడియో కాల్‌లో మాట్లాడింది. తాను బాగానే ఉన్నానని, తల్లి, సోదరుడు ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు వేసింది. శనివారం తనకు మధ్యాహ్నం డ్యూటీ ఉందని చెప్పింది. ఇక నిద్ర వస్తోందని పడుకుంటానని ఫోన్పెట్టేసింది. ఆమె పడుకున్న కొద్ది గంటల్లోనే నిందితుడు ఆమె రూమ్‌లోకి ప్రవేశించి లైంగికదాడి చేసి ప్రాణాలు తీశాడు.
వాడిని చంపెయ్యండి సార్: మృతురాలి తల్లి
ఉస్మానియా మార్చురీ దగ్గరకు వచ్చిన మృతురాలి తల్లి తన కూతురి డెడ్‌బాడీని చూసి భోరున విలపించింది. ‘‘మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం కోసం వచ్చిన నా బిడ్డను ఇంత దారుణంగా చంపిన వాడిని వదలొద్దు సార్.. చంపెయ్యండి సార్.. చంపెయ్యండి.. నా బిడ్డ ఎంత నరకయాతన పడిందో వాడు కూడా అంతే నరకయాతన అనుభవించాలి’’ అంటూ పెద్దపెట్టున రోదించింది. రూమ్‌లో ఉన్నా కూడా వచ్చి చంపేస్తే ఇక రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించింది. కాగా, ఉస్మానియా దవాఖాన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
నర్స్ మృతిపై మంత్రి సీతక్క సంతాపం
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ దారుణ హత్యకు గురైన ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు అధికారులు, పహాడిషరీఫ్ సీఐ , ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.
డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. చట్టపరమైన విచారణను వేగవంతం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో, తన కాళ్లపై తాను నిలబడి సేవా రంగంలో పనిచేస్తున్న ఓ యువతి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్ కోసం ఫోన్ చేశాడు..
పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు. హత్య చేసిన తర్వాత నిందితుడు తన స్నేహితుడికి ఫోన్‌చేసి ‘అనుకోకుండా ఓ ఇన్సిడెంట్జరిగింది. నాకు పెట్రోల్ కావాలి’ అని అనడంతో అతడు ఫోన్పెట్టేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అతడే పోలీసులకు సమాచారం ఇచ్చాడని చెప్తున్నారు.
అలాగే, హత్య జరిగిన టైంలో నిందితుడు సదావుల్లా మొబైల్ సిగ్నల్స్, దవాఖాన క్వార్టర్స్ పరిసరాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. హాస్పిటల్పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, తుక్కుగూడ జంక్షన్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. నిందితుడు ఉంటున్న ఇల్లు కూడా దవాఖాన సమీపంలోనే ఉండడంతో ఘటన జరిగిన టైంలో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు కెమెరా విజువల్స్ ద్వారా స్పష్టమైంది.
ఘటనాస్థలంనుంచి సేకరించిన వేలిముద్రలు, ఇతర ఆధారాలు నిందితుడికి సరిపోలడంతో పోలీసులు అతడే హంతకుడని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాగా, సదావుల్లా భార్య, పిల్లలు బిహార్‌లోనే ఉంటున్నారని తెలిసింది.
