అయ్యోపాపం... ఏం కష్టం వచ్చింది.. కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకిన మహిళ

 అయ్యోపాపం... ఏం కష్టం వచ్చింది.. కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకిన మహిళ
  •     ఇద్దరూ మృతి, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన

దండేపల్లి, వెలుగు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన కూతురిని నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

 లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల లచ్చన్న కూతురు రజిత (28)కు జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజన్నతో ఎనిమిదేండ్ల కింద వివాహమైంది. వీరికి అక్షిత (5), బాబు (2) ఉన్నారు. 

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రజిత నాలుగేండ్లుగా తల్లిగారి ఊరైన లింగాపూర్ లో ఉంటుండగా.. అంజన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అంజన్న ఆదివారం ఉదయం లింగాపూర్ కు వచ్చాడు. 

రజిత తల్లి వ్యవసాయ పనులకు వెళ్లగా, దివ్యాంగుడైన తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. రజిత తల్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి కూతురు కనిపించకపోవడంతో అల్లుడు అంజన్నను ప్రశ్నించింది. అతడు సమాధానం చెప్పకుండా మొబైల్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు. 

తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించగా.. సమీపంలోని వ్యవసాయ బావిలో రజిత, అక్షిత డెడ్ బాడీలు కనిపించాయి. సమాచారం అందుకున్న దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.