100 కొత్త శాఖలు, 2,500 ఉద్యోగాలు.. ఇండియన్ బ్యాంక్ టార్గెట్‌

100 కొత్త శాఖలు, 2,500 ఉద్యోగాలు.. ఇండియన్ బ్యాంక్ టార్గెట్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా  100 కొత్త శాఖలను ప్రారంభిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా  2,500 మంది కొత్త సిబ్బందిని నియమించుకోనున్నట్లు పేర్కొంది. బ్యాంక్ సీఈఓ బినోద్ కుమార్ మాట్లాడుతూ..  మధ్య, పశ్చిమ  భారత ప్రాంతాల్లో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది జూన్ నాటికి ఇండియన్‌‌‌‌ బ్యాంకుకు 6,003 దేశీయ, 3 విదేశీ శాఖలు ఉన్నాయి. ‘‘పెరుగుతున్న వ్యాపార అవసరాలు, పదవీ విరమణల భర్తీ కోసం స్పెషలిస్ట్ ఆఫీసర్లతో కలిపి 2,500 మందిని తీసుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్థూల ఎన్‌‌‌‌పీఏల రేషియో 1.5–1.6 శాతానికి, నికర ఎన్‌‌‌‌పీఏల రేషియో  0.15–-0.2 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

అలాగే రూ.200 కోట్ల మొండి బకాయిలను అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ కంపెనీ (ఏఆర్‌‌‌‌‌‌‌‌సీ) లకు  అమ్మాలని నిర్ణయించాం’’ అని బినోద్ తెలిపారు. బ్యాంక్‌‌‌‌ బంగారం రుణాల పోర్ట్‌‌‌‌ఫోలియో గత ఏడాది కాలంలో 20 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది.