రోజుకి రూ.లక్షన్నరపైనే రూమ్‌‌‌‌‌‌‌‌ రెంట్.. బ్రిక్స్ సమ్మిట్ ఎఫెక్ట్‏తో ఢిల్లీలో లగ్జరీ హోటల్స్‌‌కు భారీ డిమాండ్‌‌

రోజుకి రూ.లక్షన్నరపైనే రూమ్‌‌‌‌‌‌‌‌ రెంట్.. బ్రిక్స్ సమ్మిట్ ఎఫెక్ట్‏తో ఢిల్లీలో లగ్జరీ హోటల్స్‌‌కు భారీ డిమాండ్‌‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సమ్మిట్‌‌‌‌ జరగనుండడంతో  లగ్జరీ హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. విదేశీ ప్రతినిధులు, రాయబారుల రాకతో సెంట్రల్ ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో గదులన్నీ పూర్తిగా నిండిపోగా, అందుబాటులో ఉన్న కొన్ని రూముల అద్దెలు ఒక నైట్‌‌‌‌కి రూ.లక్షన్నర దాటాయి.   

తాజ్ మహల్, తాజ్ ప్యాలెస్ హోటళ్లలో గదులు ఖాళీ లేనట్లు చూపిస్తుండగా.. ది లీలా ప్యాలెస్ సంబంధిత తేదీలకు బుకింగ్స్‌‌‌‌ను నిలిపివేసింది. ది ఒబెరాయ్ హోటల్‌‌‌‌లోనూ చాలావరకు గదులు ముందే బుక్ అయ్యాయి. ఐటీసీ మౌర్య, షాంగ్రి-లా ఎరోస్ వంటి ప్రాపర్టీలలో అందుబాటులో ఉన్న పరిమిత గదులకు సాధారణం కంటే ఎక్కువ ధరలను  వసూలు చేస్తున్నారు. 

ఈ లగ్జరీ హోటళ్లలో సాధారణ రోజుల్లో ఒక నైట్‌‌‌‌కి రూ. 15 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్న రేట్లు, బ్రిక్స్ సమ్మిట్ వలన ఒక్కసారిగా రూ.1,50,000 నుంచి రూ. 2 లక్షల వరకు చేరాయి. సదస్సు రెండు రోజుల పాటే ఉన్నప్పటికీ, ప్రతినిధులు ముందే రావడం, బస పొడిగించుకోవడంతో ఈ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సాధారణ పర్యాటకులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది.

లేదా సెంట్రల్ ఢిల్లీకి దూరంగా బస ఎంచుకోవడం, ప్రయాణ తేదీలను మార్చుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. "గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌‌‌‌లో మా సగటు రూమ్ రేట్లు 25శాతానికి పైగా  పెరిగాయి. బ్రిక్స్ సమ్మిట్ ఉండడమే ఇందుకు కారణం” అని రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా ఎండీ  నిఖిల్ శర్మ తెలిపారు.